Share News

టీడీపీ ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర

ABN , First Publish Date - 2023-11-20T00:34:34+05:30 IST

తప్పుడు హామీలతో, దొంగ ఓట్లతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

టీడీపీ ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర
ఆధారాలు చూపుతున్న మాజీ మంత్రి కాలవ

ఆధారాలు బయటపెట్టిన కాలవ

రాయదుర ్గం, నవంబరు 19: తప్పుడు హామీలతో, దొంగ ఓట్లతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్రకు వైసీపీ తెరలేపిందన్నారు. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో 2,58,826 ఓటర్లు ఉండగా, వైసీపీ నాయకులు 32,279 ఓట్లను తొలగించాలని ఎన్నికల కమీషనకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ ఫిర్యాదులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు మండల అధ్యక్షుడుగా పనిచేసిన కాదలూరు మోహనరెడ్డి పేరు ఉండటం గమనార్హమన్నారు. పోలింగ్‌ బూత నెంబర్‌ 33 సీరియల్‌ నెంబర్‌ 701 లో ఉన్న మోహనరెడ్డితో పాటు వారి సమీప బంధువులు ఎనిమిదిమంది పేర్లను తొలగించాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. అలాగే బొమ్మనహాళ్‌ మండలం, ఎల్‌బీనగర్‌, బొమ్మనహాళ్‌ గ్రామాల్లోని టీడీపీ నాయకుల ఓట్లు తెలంగాణలో ఉన్నాయని వైసీపీ తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి బూతలో భౌతికంగా చేసిన తనిఖీల్లో 8,094 మంది చనిపోయిన ఓటర్లను గుర్తించిందని, వాటిని ఎందుకు తొలగించలేదని కాలవ ప్రశ్నించారు. వాటితో పాటు డబుల్‌ ఎంట్రీ ఓట్లు 730, నకిలీ ఓట్లు 110, వలస వెళ్లిన వారి ఓట్లు 3,124 ఉన్నట్లు టీడీపీ గుర్తించిందన్నారు. ఆ ఓట్లను తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఓట్లను తొలగిస్తే, ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న గ్రామాల్లో ఓట్లను తొలగించేందుకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పెద్దఎత్తున కుట్రలకు పాల్పడుతున్నాడన్నారు. ఇటీవల బొమ్మనహాళ్‌, ఎల్‌బీనగర్‌ గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించాలని కలెక్టరుకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. రాయదుర్గం ఓట్లపై వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్య వాదులంతా అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ తప్పుడు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, రాష్ట్ర మాజీ చేనేత డైరెక్టర్‌ టంకశాల హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పొరాళ్ల పురుష్తోత్తం, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్లు గాజుల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్‌బాషా, ప్రధాన కార్యదర్శి ఇనాయత పాల్గొన్నారు.

కాలవకు ఏడు కేసుల్లో పోలీసు నోటీసులు

రాయదుర ్గం, నవంబరు 19: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళనలపై నమోదైన కేసుల్లో ఆపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఆదివారం పోలీసులు నోటీసులు అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానికంగా చేసిన ఆందోళనల సందర్భంగా ఆయనపై ఏకంగా ఆరుకేసులు నమోదయ్యాయి. అంతకుముందు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి ఎదురుగా జరిగిన నిరసన సందర్భంగా మరో కేసు పెట్టారు. వీటన్నింటిలోనూ కాలవ శ్రీనివాసులును మొదటి ముద్దాయిగా చేర్చారు. మొత్తం ఏడు కేసులకు సంబంధించి రాయదుర్గం పోలీసులు పట్టణంలోని కాలవ నివాసంలో ఆదివారం ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ కేసుల్లో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తనను కావాలనే కేసుల పేరుతో వేధిస్తోందని కాలవ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా పాలకులు హరిస్తున్నారన్నారు. తానెప్పుడూ చట్టవ్యతిరేకంగా వ్యవహరించకపోయినా వరుస కేసులతో ప్రభుత్వం తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందన్నారు. తనతో పాటు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనాయకులపై అనేక కేసులు పెట్టారన్నారు. ఈ కేసుల బూచి చూపి తమను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికే చీటికి మాటికి కేసుల్లో ఇరికిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో తనపై పదిహేనుకుపైగా కేసులు నమోదు చేశారన్నారు. తనను ఒక చట్టవ్యతిరేక శక్తిగా చూపాలని జగన ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే తనపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తేలేదని కాలవ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-20T00:34:36+05:30 IST