వర్క్ అడ్జెస్ట్‌మెంటల్
ABN , First Publish Date - 2023-01-18T00:32:03+05:30 IST
ఉపాధ్యాయుల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ వివాదాస్పదమౌతోంది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లా విద్యాశాఖ అధికారుల మతిపోగొడుతోంది. మొన్నటి వరకూ పేపర్ ప్రమోషన తీసుకున్న వారితోపాటు, సర్‌ప్లస్ టీచర్లు, సబ్జెక్టు కన్వర్షన టీచర్లను ఇటీవల సర్దుబాటు చేశారు. సంక్రాంతి పండుగ ముందు ఉన్నఫలంగా కౌన్సెలింగ్ పెట్టారు. చాలా మంది టీచర్లకు కౌన్సెలింగ్ సమాచారం లేదు. అయినా కౌన్సెలింగ్ ¯...
గందరగోళంగా ఉపాధ్యాయ సర్దుబాట్లు
జూనియర్లకు పట్టం.. సీనియర్లకు అన్యాయం
ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్న గురువులు
ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు
కౌన్సెలింగ్ సమాచారం లేక పలువురి గైర్హాజరు
న్యాయం చేయాలని డీఈఓకు వినతి పత్రాలు
రేపటి నుంచి బడుల పునః ప్రారంభం
ఇంకా అందని సర్దుబాటు ఉత్తర్వులు
అనంతపురం విద్య, జనవరి 17: ఉపాధ్యాయుల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ వివాదాస్పదమౌతోంది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లా విద్యాశాఖ అధికారుల మతిపోగొడుతోంది. మొన్నటి వరకూ పేపర్ ప్రమోషన తీసుకున్న వారితోపాటు, సర్‌ప్లస్ టీచర్లు, సబ్జెక్టు కన్వర్షన టీచర్లను ఇటీవల సర్దుబాటు చేశారు. సంక్రాంతి పండుగ ముందు ఉన్నఫలంగా కౌన్సెలింగ్ పెట్టారు. చాలా మంది టీచర్లకు కౌన్సెలింగ్ సమాచారం లేదు. అయినా కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. సుమారు 961 మంది టీచర్లకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. చాలా మండలాల్లో సీనియర్లను కాదని జూనియర్లకు పెద్దపీట వేశారు. సీనియర్లకు ఒకమండలం నుంచి మరో మండలానికి వేస్తే.. జూనియర్లకు అనంతపురం జిల్లా కేంద్రం, జిల్లా కేంద్రానికి దగ్గరల్లో వేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అడ్డగోలుగా సర్దుబాటుపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళనకు దిగాయి. కాగా, ఎవరికీ సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వలేదు. సర్దుబాటు ఉత్తర్వుల కాపీ ఎలా ఇవ్వాలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియదట. రాష్ట్ర స్థాయి నుంచి అస్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆగమేఘాలమీద అధికారులు సర్దుబాటు చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వినతులు వెల్లువెత్తడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రమోషన పోయె.. సర్దుబాటు వచ్చె..
గత ఏడాది అక్టోబరులో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చారు. సీనియర్ సెకెండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అప్పట్లో వారి నుంచి ప్రమోషన్లకు విల్లింగ్ తీసుకున్నారు. ‘మీకు ప్రమోషన్లు వచ్చినట్లే. ఽగుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోండి’ అన్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు వారికి భరోసా ఇచ్చారు. విల్లింగ్ ఇచ్చిన టీచర్లు ‘అబ్బో’ అనుకు న్నారు. కానీ ప్రమోషన్ల ఉత్తర్వులు ఇవ్వలేదు. స్థానాలు కూడా కేటాయించలేదు. ప్రమో షన్ల ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు తీరా నెలకు రూ.2,500 గౌరవేతనం అదనంగా ఇస్తామని ప్రకటించారు. వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద స్థానాలు కేటాయించారు. ఇది విన్న బాధితులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.
హడావుడి.. గందరగోళం
ఉపాధ్యాయుల సర్దుబాటు హడావుడిగా చేయడంతో గందరగోళం నెలకొంది. కొందరు మిగులు, సబ్జెక్టు కన్వర్షన టీచర్లకు కౌన్సెలింగ్ విషయం తెలియకపోవడంతో హాజరు కాలేదు. వారు ఇప్పుడు ఎక్కడ ఖాళీలున్నాయో.. ఏం చేయాలో అని ఆందోళన చెందుతున్నారు. జూనియర్లకు మంచి స్థానాలు రావడంతో సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలపై వినతి పత్రాలు పట్టుకుని డీఈఓ ఆఫీస్‌కు క్యూ కడుతున్నారు. ఉపాధ్యాయుల నుంచి వినతులు పెద్ద ఎత్తున వస్తుండటంతో... రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు పాటించడంతోపాటు, ఖాళీలు చూపి సీనియారిటీ మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.
అయోమయం
ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులపైనా స్పష్టత లేదు. అక్టోబరులో ప్రమోషన తీసుకున్న టీచర్లకు ఇచ్చే ఉత్తర్వుల్లో ప్రమోషన అని ఇస్తారా...? లేకు సర్దుబాటు అని ఇస్తారా..? అన్నదానిపై క్లారిటీ లేదు. ఉత్తర్వులపై ఇప్పటి వరకూ తమకే స్పష్టత లేదని, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.19వ తేదీ నుంచి స్కూళ్లు పునఃప్రారంభం అవుతున్నాయి. కానీ ఇప్పటికీ సర్దుబాటు టీచర్లకు ఉత్వర్వుల కాపీలు అందలేదు. ఏ స్కూల్ టీచర్.. ఏ స్కూల్‌కు సర్దుబాటు అయ్యారో తెలియని పరిస్థితి. అధికారుల్లోనూ ఇదే అయోమయం.
ఇష్టారాజ్యం
పేపర్ ప్రమోషన్లు పొందిన టీచర్లతోపాటు సర్‌ప్లస్, సబ్జెక్టు కన్వర్షన టీచర్లకు ఇటీవల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. పేపర్ ప్రమోషన టీచర్లు 191 మంది, సర్‌ప్లస్, కన్వర్షన టీచర్లు 770 మంది.. మొత్తం 961 మందిని సర్దుబాటు చేశారు. ఈ సర్దుబాటు చేసే క్రమంలో మండలాల పరిధిలో ఎంఈఓలకు బాధ్యత అప్పజెప్పారు. వారిలో మిగిలిన టీచర్లను డీఈఓ ఆఫీస్‌కు అప్పగించారు. ఇక్కడ కౌన్సెలింగ్ పెట్టి స్థానాలు ఇచ్చారు. ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓ, డీఈఓ కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేశారు. సీనియర్లను పక్కనబెట్టి.. జూనియర్లకు మంచి స్థానాలు కేటాయించారు. ఒక మండలంలో మండల పరిధిలోనే సర్దుబాటు చేశారు. మరో మండలంలో రెండు మూడు మండలాలను దాటించారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న అంటున్నారు.
వెట్టిచాకిరీ చేయిస్తారా..?
గతంలో వేలాది మందికి ప్రమోషన్లు ఇస్తామన్నారు. రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పుడు సర్దుబాటు చేస్తున్నారు. రూ. 2500 గౌరవ వేతనం ఇచ్చి వెట్టిచాకిరీ చేయించాలని చూస్తున్నారు. సర్దుబాటులో కూడా చాలా మంది టీచర్లకు అన్యాయం జరిగింది. మిగులు టీచర్లకు, కన్వర్షన టీచర్లకు కౌన్సెలింగ్ చేసి, అనంతరం పేపర్ ప్రమోషన టీచర్లకు కౌన్సెలింగ్ చేయాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు .
- సిరాజుద్దీన, ఫ్యాప్టో జిల్లా చైర్మన
సర్దుబాటు అపహాస్యం..
రాష్ట్ర వ్యాప్తంగా పండుగకు ముందు నిర్వహించిన టీచర్ల సర్దుబాటు చిత్ర విచిత్రంగా నిర్వహించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అవలంభించారు. దీనివల్ల సీనియర్ టీచర్లకు నష్టం జరుగుతోంది. సర్దుబాటు పొరపాట్లను అధికారులు సరిదిద్దుకోవాలి. వెంటనే ఈ ప్రక్రియను రద్దు చేయాలి. జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి పారదర్శకంగా సర్దుబాటు చేయాలి.
- హరికృష్ణ, ఫోర్టో, స్టేట్ చైర్మన
సమస్యలను పరిష్కరిస్తాం...
సర్దుబాటులో కొందరు టీచర్లకు అన్యాయం జరిగిందని వినతి పత్రాలు అందించారు. ముఖ్యంగా సీనియారిటీ విషయంలో.. టీచర్ల మధ్య అస్పష్టత వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మాకు వచ్చిన గ్రీవెన్సులపై గురువారం విచారణ చేయిస్తాం. మా పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం. మా పరిధిలో లేనివి విద్యాశాఖ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తాం.
- క్రిష్ణయ్య, ఇనచార్జ్ డీఈఓ