Share News

మహిళలను ప్రోత్సహించాలిని

ABN , First Publish Date - 2023-11-19T23:26:46+05:30 IST

నేటి సమాజంలో మహిళలు పురుషులతోపాటు పోటీ పడుతూ, తమ శక్తి సామర్ధ్యాలను చాటుతున్నారని వారిని ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శోభాకరంద్లాజే పేర్కొన్నారు.

మహిళలను ప్రోత్సహించాలిని

సత్యసాయి సేవలు అనన్యసామాన్యం

పుట్టపర్తిలో ఘనంగా మహిళా దినోత్సవం

పుట్టపర్తి, నవంబరు 19: నేటి సమాజంలో మహిళలు పురుషులతోపాటు పోటీ పడుతూ, తమ శక్తి సామర్ధ్యాలను చాటుతున్నారని వారిని ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శోభాకరంద్లాజే పేర్కొన్నారు. రెండవరోజు సత్యసాయి జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మొదట సత్యసాయి కళాశాల విద్యార్థినులు పూర్ణకలశంతో, బ్రాస్‌ బ్యాండ్‌తో కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేయగా, విద్యార్థినులు వేదపఠనంతో మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, సతీసావిత్రి, సీత, సతీ అనసూయ లాంటి మహిళామణులు పుట్టిన పుణ్యదేశం భారత దేశమన్నారు. నాటినుంచి నేటివరకు భారత స్ర్తీలు అన్నిదేశాల్లో గౌరవం పొందుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు ఆదిగురువు తల్లేనన్నారు. ఉద్యోగినిగా, వ్యాపార వేత్తగా విధులు సమర్థవంతంగా నిర్వహించి, మహిళలు పురుషులకు దీటుగా శక్తి సామర్ధ్యాలు చాటుతున్నట్లు తెలిపారు. మహిళల పట్ల పురుషులు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్నారు. నేటి మహిళలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులగానే కాకుండా విమాన పైలెట్లగా కూడా ఎదగడం గర్వించతగ్గవిషయమన్నారు. రాజకీయల్లో సైతం పార్లమెంటులో మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళా రిజర్వేషన బిల్లును తీసుకురావడం మహిళా శక్తికి నిదర్శనమన్నారు. సత్యసాయిబాబా ఓ కుగ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించినా, ప్రేమ, సేవాతత్వంతో విశ్వ గురువుగా పూజలందుకుంటున్నట్లు పేర్కొన్నారు. సత్యసాయి బోధనలకు ఆకర్షితులై దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు క్యూ కట్టారన్నారన్నారు. సత్యసాయి మహిళా విద్యను ప్రోత్సహించడానికి 55యేళ్ల క్రితమే అనంతపురంలో ప్రత్యేకంగా మహిళలకు కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. సత్యసాయి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులకు ఉచిత తాగునీటిని అందించడంతోపాటు, సునామీల్లో నష్టపోయిన వారికి పక్కాగృహాలు నిర్మించారన్నారు. కరోనా సమయంలో సత్యసాయి ట్రస్టుసేవలు అభినందనీయమన్నారు.

భారత దేశంలో మహిళలకు గొప్ప గౌరవం

టెట్రాకలినోస్కీ, జర్మనీ ప్రతినిఽధి

భారత దేశంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అదే స్థాయిలో మహిళలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చి దేశం గౌరవిస్తోందని జర్మనీ మహిళా ప్రతినిధి టెట్రాకలినోస్కీ పేర్కొన్నారు. స్వచ్చమైన హృదయానికి, మనస్సుకు, ప్రేమను పంచడానికి, సహనానికి ప్రతిరూపం భారతీయ మహిళలని కొనియాడారు. భారత దేశంలో గతంలో ప్రధానిగా, నేడు రాష్ట్రపతులుగా, మంత్రులుగా మహిళలు ఉన్నతస్థానాలు అధిరోహించారన్నారు. సత్యసాయిబాబా సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస అనే పంచసూత్రాలను మానవాళికి అందించి ఆధ్యాత్మిక గురువుగా పూజలందుకుంటున్నారన్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు: ప్రమోదాదేవి, మైసూరు రాజమాత విద్యతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని మైసూర్‌ రాజమాత ప్రమోదాదేవి పేర్కొన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించడానికి సత్యసాయి బాబా ఐదు దశాబ్దాలక్రితమే పునాదులు వేశారన్నారు. ఇంటా బయటా మహిళలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నా, సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్నారన్నారు.

అలరించిన బ్రాస్‌ బ్యాండ్‌

సత్యసాయి మహిళా కళాశాల విద్యార్థినులు బ్రాస్‌ బ్యాండ్‌తో భక్తులను అలరింపచేశారు. అద్భుతంగా బ్రాస్‌ బ్యాండ్‌ నిర్వహించారు. అనంతరం డోలు, సన్నాయి వాయిద్యాలను వాయించారు. భక్తిగీతాలాపనతో మైమరపించారు. మహిళ దినోత్సవంలో పాల్గొన్నడానికి దేశ, విదేశాలనుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. సాయికుల్వంత మందిరం భక్తులతో కిటకిటలాడింది. సత్యసాయిబాబా గత ప్రసంగాన్ని సీడీ రూపంలో వినిపించారు. ఆ ప్రసంగాన్ని మహిళా భక్తులు మైమరచి విన్నారు. అనంతరం కేంద్ర మంత్రితోపాటు, మహిళ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-11-19T23:26:50+05:30 IST