జెండాలను తొలగిస్తారా లేదా..?
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:04 AM
విద్యుత స్తంభాలకు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు కట్టిన జెండాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్లు బుధవారం ధర్నాకు దిగారు. కార్యాలయంలో ఉన్న ఆర్డీఓ వెంకటేష్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు.
ఆర్డీఓను నిలదీసిన టీడీపీ నాయకులు
తాడిపత్రి, డిసెంబరు 27: విద్యుత స్తంభాలకు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు కట్టిన జెండాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్లు బుధవారం ధర్నాకు దిగారు. కార్యాలయంలో ఉన్న ఆర్డీఓ వెంకటేష్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. వీరిని ఆర్డీఓ లోపలికి పిలిపించి సమస్య ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ బస్సుయాత్ర సందర్భంగా పట్టణంలోని సీబీ రోడ్డు డివైడర్ల మధ్య ఉన్న విద్యుత స్తంభాలకు వైసీపీ జెండాలను కట్టారని, నెలరోజులు కావస్తున్నా వైసీపీవారు తొలగించలేదని ఆర్డీఓకు వివరించారు. మున్సిపల్ సిబ్బంది సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, రెండురోజుల సమయం అడిగి, మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. అనంతరం డీఎస్పీ గంగయ్య, ట్రైనీ డీఎస్పీ హేమంతకుమార్ తదితరులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి జెండాల తొలగింపులో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి ఆరాతీశారు.
డబ్బుల మూటకోసం వచ్చాడు
ఆర్డీఓపై మండిపడ్డ జేసీ ప్రభాకర్
తాడిపత్రి, డిసెంబరు 27: అనంతపురం ఆర్డీఓ వెంకటేష్ ఒక యూజ్‌లెస్ ఫెలో అని, కలెక్షన డబ్బును మూటగట్టుకోవడానికి తాడిపత్రికి వచ్చాడని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతలకు అనుకూలంగా, జెండాల వివాదంపై తీర్పు చెప్పడానికి వచ్చావా అని ఆర్డీఓను ప్రశ్నించారు. వైసీపీ నేతల నుంచి ఎంత తీసుకున్నావని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఊడిగం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే, వైసీపీ నాయకులతోపాటు అధికారులు అడ్డుకుంటున్నారని, వారికి ఆర్డీఓ వంతపాడుతున్నాడని మండిపడ్డారు. వైసీపీ నేతలకు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారడం అవమానంగా ఉందని అన్నారు. ఆర్డీఓగా పనిచేసి, ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్న గౌతమి కలెక్టర్‌గా వస్తే సంతోషించామని, కానీ ఆమె కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. వైసీపీ నేతలు, అధికారుల తీరు, పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్న పరిస్థితి గురించి ఎన్ని లేఖలు రాసినా కలెక్టర్ సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.