వన్యప్రాణుల రక్షణ ప్రశ్నార్థకం
ABN , First Publish Date - 2023-05-26T23:53:10+05:30 IST
ఉమ్మడి జిల్లాలో వణ్యప్రాణుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అడవుల్లో తగిన తిండి, నీరు దొరక్క జనారణ్యం లోకి వస్తుండటంతో ప్రజలతో పాటు వాటికి కూడా ముప్పు ఏర్పడుతోంది. వన్యప్రాణులు గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లోకి వస్తుండటంతో స్థానిక ప్రజలు చీకటి పడితే బయటకు రావడానికి జంకుతున్నారు

ఆహారం దొరక్క జనారణ్యంలోకి..
పశువులు, ప్రజలపై దాడి చేస్తున్న వైనం
బిక్కు బిక్కుమంటున్న అటవీ సమీప గ్రామస్థులు
రక్షణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యం
అనంతపురం న్యూటౌన, మే26: ఉమ్మడి జిల్లాలో వణ్యప్రాణుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అడవుల్లో తగిన తిండి, నీరు దొరక్క జనారణ్యం లోకి వస్తుండటంతో ప్రజలతో పాటు వాటికి కూడా ముప్పు ఏర్పడుతోంది. వన్యప్రాణులు గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లోకి వస్తుండటంతో స్థానిక ప్రజలు చీకటి పడితే బయటకు రావడానికి జంకుతున్నారు. గత వారంలో జిల్లా పరిధిలోని డీ హీరేహాళ్‌లో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు వణికిపోయారు. కళ్యాణదుర్గం ప్రాంతం గోశాలలో చిరుత సంచారంతో స్థానికులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. డీఎ్‌ఫఓ కళ్యాణదుర్గం లోని గోశాలను పరిశీలించి అక్కడి వారికి అవగాహన కల్పించి ధైర్యం చెప్పారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అటవీశాఖ ద్వారా వన్యప్రాణులకు సాసర్ పిట్స్ ద్వారా నీటిని సమకూరుస్తున్నారు. అయితే అడవిలో తగిన తిండి లేక అవి జనారణ్యంలో వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సాసర్ పిట్స్‌లో నీళ్లు సరిగా పోయకపోవడంతో దాహం తీర్చుకోవడానికి సమీప పొలాలవైపు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 129 సాసర్ పిట్స్
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్న వన్యప్రాణుల సంఖ్యకు అనుగుణంగా 129 సాసర్ పిట్స్ ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ యంత్రాంగం చెబుతోంది. ఇందులో గుత్తి రేంజ్‌లో 20, కళ్యాణదుర్గం రేంజ్‌లో 80, బుక్కపట్నం రేంజ్‌లో 29 సాసర్ పిట్స్ ఉన్నాయి. వీటిలో వేసవిలోని రెండు నెలలు కనీసం 10 రోజులకు ఒక్కసారైన నీటిని నింపేలా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు అమలు చేస్తున్నారనేది మాత్రం అధికారులకే తెలియాలి.
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక నిధులు
వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఏడాదిలో రూ.30 లక్షల నుండి రూ.40 లక్షల వరకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. వీటిలో వన్యప్రాణుల సంరక్షణకు కొంత మేరకు ఖర్చు చేస్తే ఇతరత్ర సొమ్మును వన్యప్రాణుల నుండి పంటలు, జీవాలు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడానికి ఉపయోగించనున్నారు. అయితే వన్యప్రా ణుల సంరక్షణకంటే నష్టపరిహారానికే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
జిల్లా అడవుల్లో ఉన్న వన్యప్రాణులను పరిశీలిస్తే..
జిల్లాలోని అడవుల్లో ఎలుగుబంట్లు, చిరుతపులులు, జింకలు, క్రిష్ణ జింకలు, చుక్కల జింకలు, సాంబార్ జింక, కొన్ని ప్రాంతాల్లో కొండ గొర్రెలు, గుంటనక్కలు, పెద్దనక్కలు, తోడేళ్లు, కుందేళ్లు, ఉడుములు, నెమళ్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చిరుతలు తక్కువగా ఉన్నప్పటికి ఈ మధ్యకాలంలో ప్రజలు, జంతువులకు హాని ఎక్కువగా చేస్తున్నట్లు సమాచారం. ఎలుగుబంట్లు పంటపొలాల్లోకి వెళ్లే రైతులు, కూలీలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న జంతువులను సైతం గాయపరుస్తున్నాయి. ఇక నక్కలు, పెద్ద నక్కలు, తోడేళ్లు గొర్రెల మందలపై దాడి చేసి, ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. ఇక మిగిలిన వన్యప్రాణులకు మాత్రం జనం నుంచే రక్షణ లేకుండా పోయింది. జింకలు, కుందేళ్లు, కొండ గొర్రెలు లాంటివి జనసంచారంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటిని రక్షించాల్సిన అటవీశాఖ సిబ్బంది తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వేటగాళ్లు సాసర్ పిట్స్ ప్రాంతంలో వలలు వేసి పెట్టడంతో నీటి కోసం వచ్చిన వణ్యప్రాణులు వాటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతు న్నాయి. అందుకే అటవీశాఖ యంత్రాంగం గ్రామాలకు దగ్గరలో ఉన్న అటవీప్రాంతంలో సాసర్ పిట్స్‌లో నీటిని నింపడం లేదన్న ప్రచారం జరుగుతోంది.