పెన్షనర్లపై వైసీపీకి ఎందుకంత కక్ష్
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:21 PM
కేవలం పెన్షనపై బతుకుతున్న తమపై వైసీపీ ప్రభుత్వానికి ఎందుకీ కక్ష్య అని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్ మండిపడ్డారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు 17: కేవలం పెన్షనపై బతుకుతున్న తమపై వైసీపీ ప్రభుత్వానికి ఎందుకీ కక్ష్య అని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్ మండిపడ్డారు. ఆదివారం స్థానిక లలితా కళాపరిషతలో అఖిలభారత పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, రిటైర్డ్ డీఆర్వో రఘునాథ్, జిల్లా ఖజానా శాఖ డీడీ సరళా విజయకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పెన్షనర్ల పితామహుడు డీఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దనగౌడ్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా నెలలో మొదటివారంలో పెన్షన అందక పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 185 నెలల డీఆర్ బకాయిలు, 11 పీఆర్‌సీ బకాయిలు ఉంచడం దారుణమన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా అనేకమైన సేవలందించిన తమకు వృద్ధాప్య సమయంలో ప్రభుత్వం మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోందన్నారు. పెన్షనతో బతుకుజీవుడా అని కాలం వెల్లదీస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొంది 75 ఏళ్లు పూర్తీ చేసుకున్న 100 మంది పెన్షనర్లను సన్మానించారు. సంఘం ఆర్థిక పురోభివృద్ధి కోసం జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పన్న రూ. 50 వేలు, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రూ. 10 వేలు, ఈసీ మెంబర్ నాగరాజేశ్వరీ రూ. 10 వేలు చెక్కులను అధ్యక్షుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ఖలందర్, రామకృష్ణ, ప్రభాకర్, డేనియల్ ప్రభాకర్, మహమ్మద్, తిప్పన్న, నారాయణ, కిష్టప్ప, జయరాం, పుల్లప్ప, నారాయణస్వామి, సత్యనారాయణ, సూర్యనా రాయణ, అనంతయ్య, సావిత్రిదేవి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.