పట్టాలు ఇచ్చేదెన్నడు..?
ABN , First Publish Date - 2023-06-11T00:35:46+05:30 IST
బడుగులు సాగుచేసుకుంటున్న బంజరు భూములకు డి పట్టాలు అందించి, చట్టబద్ధ హక్కు కల్పిస్తామని సీఎం జగన ఆర్భాటంగా ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరిలో భూములు సాగుచేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
బంజరు భూముల రైతుల ఎదురు చూపు
దరఖాస్తులు సమర్పించి మూడు నెలలు
పత్తాలేని అసైనమెంట్ కమిటీ
అధికార పార్టీవారి కొర్రీలతో ఆగిన ప్రక్రియ
బడుగులు సాగుచేసుకుంటున్న బంజరు భూములకు డి పట్టాలు అందించి, చట్టబద్ధ హక్కు కల్పిస్తామని సీఎం జగన ఆర్భాటంగా ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరిలో భూములు సాగుచేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణ రైతులు తమకు పట్టా వస్తుందని, భూమిపై హక్కు లభిస్తుందని ఆనందబడ్డారు. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత పాలకులు, అధికారులు ఆ ఊసే ఎత్తడంలేదు. పట్టాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఎంతో హడావుడి చేసిన రెవెన్యూ అధికారుల నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఉగాదికి పట్టాలు ఇస్తామన్న పాలకులు, మూడు నెలలు అయినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
- అనంతపురం టౌన
ప్రజాప్రతినిధుల కొర్రీలు
పేదలకు ఇచ్చే పట్టాలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజకీయం చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల భూములు సాగు చేసుకుంటున్నారని తేల్చారు. ఆర్డీఓ, తహసీల్దార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పక్కా లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. డి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధమైన తరుణంలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన వారికే ఇవ్వాలని కొర్రీ పెట్టారు. దీంతో పట్టాల పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని సమాచారం.
అడ్రస్ లేని అసైనమెంట్ కమిటీ
డి పట్టాలు ఇవ్వాలంటే అసైనమెంట్ కమిటీ అనుమతి ఇవ్వాలి. ఈ కమిటీకి జిల్లా ఇనచార్జి మంత్రి చైర్మనగా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్ కన్వీనరుగా ఉంటారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశమై, చర్చించి డి పట్టా పొందేందుకు అర్హుల జాబితాకు ఆమోదం వేయాలి. కానీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ‘మనవాళ్లే జాబితాలో ఉండాలి’ అని అధికార పార్టీ జిల్లా నాయకులు మెలిక పెట్టడంతో ఇనచార్జి మంత్రి ఇటువైపు చూడడం లేదని అంటున్నారు.
ఎస్సీ, ఎస్టీలపై చిన్నచూపు..
వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల చిన్నచూపు చూస్తోంది. అనేక ఏళ్లుగా సాగుచేసుకుంటున్న బంజరు భూములకు డి పట్టాలు ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. జిల్లాలో అసైనమెంటు చట్టానికి పాలకులు, అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అనేకమంది దళితులు న్యాయం కోసం ఆత్మహత్యకు పాల్పడ్డారు. లబ్ధిదారులకు వెంటనే డి పట్టాలు ఇవ్వాలి. -
చిన్న ఆంజనేయులు, దళిత సంఘం నాయకుడు
పట్టాలు సిద్ధం చేశాం..
డి పట్టాల పంపిణీకి అర్హులైన రైతులను గుర్తించాం. పక్కా జాబితా మేరకు డి పట్టాలు సిద్ధం చేశాం. సీఎం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే పట్టాలు అందజేస్తాం. లబ్ధిదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు.
- కేతన గార్గ్, జాయింట్ కలెక్టరు