ఇంటిపట్టా ఇంకెప్పుడు?
ABN , First Publish Date - 2023-03-25T00:46:32+05:30 IST
పేదలు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏళ్ల తరబడి కేటాయించడం లేదు. భూ సేకరణలో జాప్యం కారణంగా ఈ దుస్థితి నెలకొంది. గృహ నిర్మాణానికి అనువుగాని చోట ఇంటి స్థలాలను సేకరించి లే ఔట్ వేయడంతో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు.
90 రోజుల్లో పట్టా ఉత్తిదే
ఏళ్ల తరబడి పేదల నిరీక్షణ
జిల్లాలో 12 వేల మంది దరఖాస్తు
8,523 మంది అర్హులుగా గుర్తింపు
యాడికి మండలం రాయలచెరువు ప్రజల కోసం ఏర్పాటు చేసిన జగనన్న లే ఔట్ ఇది. మొత్తం 118 మందికి ఈ గుట్టపై మూడేళ్ల క్రితం ఇంటి స్థలాలను కేటాయించారు. ఇంటి పట్టా హామీ పత్రాలను అందజేశారు. ఆ తరువాత వివిధ కారణాలతో లే ఔట్‌ను రద్దు చేశారు. లబ్ధిదారులకు మరోచోట ఇంటి స్థలాలు కేటాయించలేదు. అధికారుల వద్దకు వెళితే అదిగో.. ఇదిగో అంటున్నారు. కనీసం ఎక్కడ ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఉరవకొండ, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, అనంతపురం రూరల్, కళ్యాణదుర్గం ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామంలోని జగనన్న లే ఔట్ లో అనంతపురం నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలకు చెందిన 6,850 మంది నిరుపేదలకు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇక్కడ ఇంటి స్థలాలు కేటాయించారు. పట్టాలు మంజూరు చేశారు. కానీ ఇసుక, చవుడు భూమి కావడంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పట్టాలు రద్దు చేసి, వేరే ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు.. చివరకు గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కూడా ప్రకటించారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. మూడేళ్లుగా ఈ లే ఔట్ ఖాళీగా ఉంది.
అనంతపురం సిటీ, మార్చి 24: పేదలు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏళ్ల తరబడి కేటాయించడం లేదు. భూ సేకరణలో జాప్యం కారణంగా ఈ దుస్థితి నెలకొంది. గృహ నిర్మాణానికి అనువుగాని చోట ఇంటి స్థలాలను సేకరించి లే ఔట్ వేయడంతో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. మరికొన్నిచోట్ల ఇతర కారణాలతో లే ఔట్లను రద్దు చేశారు. ఇలాంటి చోట పేదలకు ప్రత్యామ్నాయ స్థలం చూపలేదు. పట్టా కోసం దరఖాస్తు చేసినా స్థలం ఎప్పుడు కేటాయిస్తారో చెప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 12 వేల మందికి పైగా లబ్ధిదారులు ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,523 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు.
అంతులేని జాప్యం
పేదల సొంతింటి కల నెరవేర్చాల్సిన ప్రభుత్వం.. హామీలకు పరిమితమౌతోంది. అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. దీంతో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు నిరాశ ఎదురవుతోంది. కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి అధికారులను ప్రశ్నిస్తే.. ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. మరికొందరు అధికారులు ‘భూసేకరణ చేస్తున్నాం.. త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తాం’ అని చెప్పి పంపుతున్నారు.
త్వరలోనే అందజేస్తాం..
అర్హులందరికీ ‘90 రోజుల్లో ఇంటి పట్టా’ పథకం కింద త్వరలోనే పట్టాలను అందజేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కొన్ని ప్రాంతాలలో భూసమస్యలు ఉండటంతో కాస్తా ఆలస్యమవుతోంది. మరికొన్ని ప్రాంతాలలో కోర్టు కేసులు పెండింగ్ ఉండటంతో ఇవ్వలేకపోయాం. భూసేకరణ పక్రియ కూడా దాదాపు పూర్తయింది. ప్రభుత్వానికి నివేదిక పంపాం. అర్హులైన వారందరికి తప్పకుండా ఇంటి పట్టాలు అందజేస్తాం. అనర్హుల జాబితాలో అర్హులుంటే పరిశీలించి న్యాయం చేస్తాం.
- కేతనగార్గ్, జిల్లా జాయింట్ కలెక్టర్