ఏది కనిపిస్తే అది..!

ABN , First Publish Date - 2023-05-26T00:55:13+05:30 IST

అధికార పార్టీ నాయకుల కబ్జాల పర్వం కొనసాగుతోంది. విలువైన భూములు, స్థలాలే కాదు.. ప్రధాన రహదారులను కూడా వదలడం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైనే వారి కన్ను పడింది. జన సంచారానికి ముఖ్యమైన ఆ దారిని మింగేందుకు స్కెచ వేశారు.

ఏది కనిపిస్తే అది..!
కొనుగోలు చేసిన స్థలంలోకి కలిపేసిన రహదారి ఇదే..

దారిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు

చేతులు కలిపిన ఓ వీఆర్వో

సీకే పల్లిలో ఆ ఇద్దరి అరాచకం

చెన్నేకొత్తపల్లి, మే 25: అధికార పార్టీ నాయకుల కబ్జాల పర్వం కొనసాగుతోంది. విలువైన భూములు, స్థలాలే కాదు.. ప్రధాన రహదారులను కూడా వదలడం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైనే వారి కన్ను పడింది. జన సంచారానికి ముఖ్యమైన ఆ దారిని మింగేందుకు స్కెచ వేశారు. దారి పక్కనే స్థలాన్ని కొనుగోలు చేశారు. యంత్రాలు పెట్టి మరీ సీసీ రోడ్డును ధ్వంసం చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలంలోకి కలిపేసుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ డాబా యజమాని, ఓ వీఆర్వో అరాచకమిది.

ప్రశ్నిస్తే బెదిరింపులు

చెన్నేకొత్తపల్లిలో అది ప్రధాన రహదారి కావడంతో 25 ఏళ్ల క్రితమే అప్పటి టీడీపీ ప్రభుత్వం సీసీ రోడ్డును నిర్మించింది. బస్టాండుకు అతిసమీపంలో ఉండటంతో అర్ధరాత్రి బస్సు దిగినా.. ఆ దారివెంట ప్రజలు సులభంగా వెళ్లేవారు. నిత్యం వందలాదిమంది తిరిగే దారిని ఉన్నఫలంగా ఆక్రమించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ డాబా యజమాని, బాధ్యత కలిగిన ఓ వీఆర్వో కలిసి దారిని కబ్జా చేయడం చూసి జనం విస్తుపోతున్నారు. దీన్ని ప్రశ్నించిన వారిని అధికార పార్టీ నాయకుడు బెదిరిస్తున్నారు. ‘అది దారి అనేందుకు నీ వద్ద ఆధారాలు ఉన్నాయా..?’ అని ఎదురు ప్రశ్న వేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

నోటీసులు ఇచ్చాం..

సీసీరోడ్డు ధ్వంసం చేసిన స్థల యజమానికి నోటీసులు ఇచ్చామని ఇనచార్జి ఎంపీడీఓ అశోక్‌ నాయక్‌ తెలిపారు. అతను ఇచ్చే వివరణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. దారి ఆక్రమణ గురించి తమకు ఫిర్యాదులు వచ్చాయని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్దారు సుబ్బలక్ష్మి తెలిపారు. రికార్డుల ప్రకారం ఆ స్థలం గ్రామ కంఠంలో ఉందని, ప్లానలో దారి వివరాలను పరిశీలిస్తామని తెలిపారు.

Updated Date - 2023-05-26T00:55:19+05:30 IST