డిసి్ట్రబ్యూటరీలకు సాగునీరు ఇస్తామన్న హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2023-09-04T23:54:06+05:30 IST
అధికారంలోకి వస్తేనే హంద్రీనీవా డిస్ర్టీబ్యూటరీలకు సాగునీరు అందిస్తామని జగన హామీ ఇచ్చి నాలుగేళ్లైనా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఉరవకొండ,సెప్టెంబరు4: అధికారంలోకి వస్తేనే హంద్రీనీవా డిస్ర్టీబ్యూటరీలకు సాగునీరు అందిస్తామని జగన హామీ ఇచ్చి నాలుగేళ్లైనా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ర్టాన్ని రక్షించండి- దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర ఉరవకొండకు చేరుకుంది. స్థానిక పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాభావం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం సొంత జిల్లా కడపలో కూడా అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు గతంలో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయని, ఆ గేట్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 2కోట్లు నిధులు విడుదల చేసి, 6సార్లు టెండర్లు పిలిచినప్పటికీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని తెలిసి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజాసమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్, మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లెనినబాబు, రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, కేశవరెడ్డి, మల్లికార్జున, సుల్తాన, తలారి మల్లికార్జున, రమేష్ పాల్గొన్నారు.