మా పిల్లలు ఏం కావాలి...?
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:35 AM
అంగనవాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో కాకుండా అంగనవాడీలతోనే ఓపెన చేయించి పిల్లలకు పౌష్టికాహారం అందించేలా చూడాలంటూ పిల్లల తల్లిదండ్రులు, లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఆదివారం అనంత నగరంలోని రాణీనగర్-4 అంగనవాడీ కేంద్రం వద్ద పలువురు లబ్ధిదారులు నిరసన తెలిపారు
అంగనవాడీలతోనే సెంటర్లు నిర్వహించాలని లబ్ధిదారుల డిమాండ్.. పలుచోట్ల నిరసన
అనంతపురం విద్య, డిసెంబరు 17: అంగనవాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో కాకుండా అంగనవాడీలతోనే ఓపెన చేయించి పిల్లలకు పౌష్టికాహారం అందించేలా చూడాలంటూ పిల్లల తల్లిదండ్రులు, లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఆదివారం అనంత నగరంలోని రాణీనగర్-4 అంగనవాడీ కేంద్రం వద్ద పలువురు లబ్ధిదారులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ... అంగనవాడీ కేంద్రాల్లో తమ పిల్లలకు కార్యకర్తలు అన్నం పెట్టేవారనీ, 4 గంటల వరకూ నిద్రపుచ్చేవారనీ, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సచివాలయ సిబ్బంది ఎవరూ సరిగా రావడం లేదనీ, తమ పిల్లలను ఎవరూ సెంటర్లకు పిలవడం లేదంటూ... వాపోయారు. ‘మా పిల్లలు ఏం కావాలి? జగన నీకో నమస్కారం..’ అంటూ ఎద్దేవా చేశారు. వెంటనే కేంద్రాలు అంగనవాడీలతోనే ఓపెన చేయించాలని డిమాండ్ చేశారు.
అంగనవాడీల పోరాటానికి అండగా నిలుస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం కల్చరల్, డిసెంబరు 17: తమ డిమాండ్ల సాధనకు అంగనవాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ పేర్కొన్నారు. అంగనవాడీల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆదివారం స్థానిక గణేనాయక్ భవనలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏపీలోని అంగనవాడీలకు తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తామని వైఎస్ జగన్మోహనరెడ్డి వాగ్దానం చేశారన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకూ ఆ హామీని నెరవేర్చకుండా అంగనవాడీలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగనవాడీల వేతనం రూ.18వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి జగన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేకచోట్ల అధికారులు, సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించి, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం శోచనీయమన్నారు. సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలనీ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగనవాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య, సావిత్రి, జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.