వామ్మో.. వనటౌన!

ABN , First Publish Date - 2023-01-18T00:39:42+05:30 IST

పోలీస్‌ స్టేషన పేరు చెబితే నేరస్థులు భయపడతారు. కానీ ఆ స్టేషన పేరు చెబితే పోలీసులే భయపడుతున్నారు. ‘అమ్మో.. ఆ పోలీస్‌ స్టేషనా...? వద్దు బాబోయ్‌..! ఇంకో స్టేషన పేరు ఏదైనా చెప్పండి.. అక్కడికి వెళతాం..’ అంటున్నారట సబ్‌ ఇనస్పెక్టర్లు. ఆ స్టేషనలో అడుగు పెట్టడానికి ఎస్‌ఐలు జంకుతున్నారు. నిత్యం ప్రొటోకాల్స్‌, ధర్నాలు, వివాదాలు, ఘర్షణలు...

వామ్మో.. వనటౌన!

నిత్యం గొడవలు.. వివాదాలు

పరిధి ఎక్కువ.. ఎస్‌ఐలు తక్కువ

ఆ స్టేషన అంటే ఎస్‌ఐలకు హడల్‌

ర్యాంకర్‌ ఎస్‌ఐలతో నెట్టుకొస్తున్నారు..!

పోలీస్‌ స్టేషన పేరు చెబితే నేరస్థులు భయపడతారు. కానీ ఆ స్టేషన పేరు చెబితే పోలీసులే భయపడుతున్నారు. ‘అమ్మో.. ఆ పోలీస్‌ స్టేషనా...? వద్దు బాబోయ్‌..! ఇంకో స్టేషన పేరు ఏదైనా చెప్పండి.. అక్కడికి వెళతాం..’ అంటున్నారట సబ్‌ ఇనస్పెక్టర్లు. ఆ స్టేషనలో అడుగు పెట్టడానికి ఎస్‌ఐలు జంకుతున్నారు. నిత్యం ప్రొటోకాల్స్‌, ధర్నాలు, వివాదాలు, ఘర్షణలు... ఇలా ఎన్నెన్నో సమస్యలు..! ఇవికాక రొటీన నైట్‌ బీట్‌లు. ఊపిరి తీసుకోలేనంత పని ఉంటుంది అక్కడ..! అదే.. అనంతపురం వనటౌన పోలీస్‌స్టేషన. నగరంలో.. పరిధి ఎక్కువగా ఉండే పోలీస్‌ స్టేషన అది. ఈ స్టేషనలో ఎస్‌హెచఓ హోదాలో సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ర్యాంకర్‌ ఎస్‌ఐ. ఈ స్టేషన పరిధిలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. రోజువారీ కేసుల్లో గొడవలవే ఎక్కువట. పనిభారం ఎక్కువగా ఉండే ఈ స్టేషనకు తగినంతమంది ఎస్‌ఐలను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- అనంతపురం క్రైం

ఇటీవలి నేరాలు

- డిసెంబరు 22న త్రిబుల్‌ ఎస్‌ బార్‌ యజమాని వెంకటాద్రి బ్యాంక్‌ ఖాతా నుంచి (ఐసీఐసీఐ) ఏకంగా రూ.కోటి మరో ఖాతాకు బదిలీ అయింది. హ్యాకర్లు చేసిన ఈ నేరం గురించి దర్యాప్తు కోసం సీఐ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసులో ఉత్తర భారతదేశానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- డిసెంబరు 29న ఓ భూవివాదంలో హౌసింగ్‌ బోర్డులోని ఇరానీ కేఫ్‌ ఎదుట కేవీ మల్లారెడ్డి తదితరులపై కానిస్టేబుల్‌ వెంకటేష్‌ నాయక్‌ దాడి చేయించాడు.

- వనటౌన పీఎస్‌ సమీపంలో పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం క్యూలైనలో తన బంగారు గొలుసు పోయిందని, వెతికిపెట్టాలని సెబ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఫణీంద్రనాథ్‌ 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- ఈ నెల 7న నవోదయ కాలనీకి చెందిన ఇంటర్‌ విద్యార్థిని, కమలానగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న శెట్టూరుకు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు.

- రెండు వారాల క్రితం నకిలీ బంగారం చూపి రూ.15 లక్షలు దోచేశారని బాధితుడు శ్రీనివాసులు వనటౌన పోలీసులకు ఈ నెల 7వ తేదీ ఫిర్యాదు చేశాడు.

- గడిచిన రెండు వారాలలో రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇవికాక ఎన్నెన్నో కేసులు వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు పోలీసు అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఐలను కేటాయిస్తే, విభాగాల వారిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు లేవు.

ఎందుకొచ్చిన గొడవ..!

వనటౌన స్టేషనకు వచ్చేందుకు ఎస్‌ఐలు అయిష్టత చూపుతున్నారు. ఆ స్టేషన పరిధిలో రెండు మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎస్‌ఐలు ఇటీవల ఎవరూ లేరు. మండల కేంద్రాల్లోని పీఎ్‌సలలో ఎస్‌ఐలదే హవా. అక్కడ వారు చెప్పిందే వేదం. కానీ పట్టణాలు, జిల్లా కేంద్రంలోని స్టేషన్లలో సర్కిల్‌ ఇనస్పెక్టర్లే కీలకంగా ఉంటారు. ఇక్కడ ఎస్‌ఐలు పై అధికారి సూచనలు, ఆదేశాల మేరకే పనిచేయాల్సి ఉంటుంది. వనటౌన పరిధి పాతూరులోని అన్ని కాలనీలతో పాటు శారదానగర్‌ వరకు, కమలానగర్‌, ఇటు ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ఉంటుంది. దీంతో స్టేషనకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య భారీగా ఉంటుంది. మట్కా కూడా ఎక్కువగా జరుగుతుంది. తరచూ గొడవలు, ఆత్మహత్యలు, దొంగతనాలు జరుగుతుంటాయి. కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు, ఆందోళనలకు బందోబస్తు, ప్రొటోకాల్స్‌, ప్రతి రాత్రి నైట్‌ బీట్స్‌ తదితరాలు ఉంటాయి. అందుకే.. వనటౌన పేరు చెబితే ఎస్‌ఐలు ఎందుకొచ్చిన తంటా అని అంటున్నారు.

కట్టడి చేసేదెవరు..?

కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు తగినంత మంది ఉన్నా.. వారిని పర్యవేక్షించే ఎస్‌ఐ స్థాయి అధికారి లేకపోతే పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంటుంది. ప్రతి రోజు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. కొన్ని నేరాలను దర్యాప్తు చేసి తేల్చాల్సి వస్తుంది. దీనికితోడు పెండింగ్‌ కేసులు ఉంటాయి. స్టేషనలో పరిష్కారం కాకపోతే స్పందనలో ఎస్పీ వద్దకు వెళుతుంటారు. ఇలాంటి వాటిని చూడటానికి సమర్థులైన ఎస్‌ఐలు ఉండాలి. వనటౌన స్టేషనకు ఇప్పుడు ఎస్‌ఐల కొరత వేధిస్తోంది. నేరాలపై పట్టున్న ఓ ఏఎస్‌ఐని ఇటీవల మరో స్టేషనకు బదిలీ చేశారు. త్వరగా ఎస్‌ఐలను నియమించకపోతే వనటౌన పరిధిలో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరగడంతోపాటు.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

ఎందుకో ఏమో..!

జిల్లా పరిధిలో ఈ నెల మొదటి వారంలో దాదాపు ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేశారు. గతంలో చేసిన స్టేషన్లను వారు కోరినందుకు.. ఏరికోరి మరీ పంపారు. కానీ వనటౌన స్టేషనకు మాత్రం ఎవరినీ పంపలేదు. అనంతపురం నగరంలో రూరల్‌ పీఎస్‌తో కలిపి ఐదు స్టేషన్లు ఉన్నాయి. టూటౌన, త్రీటౌన, ఫోర్త్‌టౌన, రూరల్‌ పోలీస్‌స్టేషన్లలో ముగ్గురు, నలుగురు ఎస్‌ఐలు ఉన్నారు. కానీ నేరాల సంఖ్య ఎక్కువగా ఉండే వనటౌనలో ఇద్దరే ఉన్నారు. ఈ స్టేషనకు యంగ్‌ ఎస్‌ఐలను ఎందుకు కేటాయించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం వనటౌనలో ఎస్‌ఐ గౌస్‌, తిప్పేనాయక్‌ ఉన్నారు. వీరిలో ఒకరు ర్యాంకర్‌ ఎస్‌ఐ. ఇదివరకు ఉన్న వెంకటకృష్ణ, విజయభాస్కర్‌ సైతం ర్యాంకర్‌ ఎస్‌ఐలే. వారిలో ఒకరు ఎస్‌బీకి, మరొకరు దిశ పోలీస్‌స్టేషనకు వెళ్లారు. వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు.

Updated Date - 2023-01-18T00:39:47+05:30 IST