పశ్చిమ రాయలసీమ టీడీపీదే

ABN , First Publish Date - 2023-03-19T03:07:55+05:30 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ ఘనవిజయం సాధించింది.

పశ్చిమ రాయలసీమ టీడీపీదే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయం

అనంతపురం/కర్నూలు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపుగుర్రం ఎక్కారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మెజార్టీ సాధించారు. 3 రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరకు టీడీపీ అభ్యర్థినే విజయం వరించింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2,45,687 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 11 రౌండ్లుగా ఓట్లను విభజించి లెక్కించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు, టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. మూడో స్థానం లో నిలిచిన పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు 18,758 ఓట్లు దక్కాయి. మరో 19,239 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కిం పు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి కంటే 1,820 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసేయగా 2,26,448 ఓట్లు మిగిలాయి. ఈ లెక్కన మొదటి ప్రాధాన్య ఓటులో గెలవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 1,13,224 ఓట్లు రావాలి. తొలి ప్రాధాన్యం కింద వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు మాత్రమే వచ్చాయి. అగ్రస్థానంలో ఉన్న ఆయన గెలిచేందుకు మరో 17,255 ఓట్లు అవసరమయ్యాయి.

దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును శుక్రవారం రాత్రి చేపట్టారు. పోటీ చేసిన ఇతర 45 మంది అభ్యర్థులను ఎలిమినేట్‌ చేసేసరికి వైసీపీ అభ్యర్థి మెజార్టీ 1,009కి పడిపోయింది. దీంతో తమ అభ్యర్థి విజయం ఖాయమని భావించి, టీడీపీ వర్గీయులు సంబరాలు ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర ఎలిమినేషన్‌తో టీడీపీకి రెండో ప్రాధాన్య ఓట్లు వరదలా పోటెత్తాయి. వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కంటే 1,066 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 3,312, వైసీపీ అభ్యర్థికి 1,237 ఓట్లు ద్వితీయ ప్రాధాన్యం కింద దక్కాయి. ఈ ఓట్లతో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి మొదటి స్థానానికి ఎగబాకారు. మొదటి, రెండో ప్రాధాన్య ఓట్లు కలిపి టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి 1,09,781 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్‌ కారణంగా టీడీపీ అభ్యర్థి మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించడంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

రీకౌంటింగ్‌కు వైసీపీ అభ్యర్థి డిమాండ్‌

ఓట్ల లెక్కింపులో తనకు అన్యాయం జరిగిందని.. రీకౌంటింగ్‌ చేపట్టాలని వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ఒకే బండిల్‌లో ఆరు ఓట్లు తేడా వచ్చాయని, టీడీపీకి వేసిన మరో బండిల్‌లో 50 ఓట్ల బదులు 70 ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్‌లో అవకతవకలపై రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌.వో), కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేసినా ఆమె తిరస్కరించారు. కాగా, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. కర్నూ లు, నంద్యాల, జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ఇళ్ల వద్ద కేక్‌లు కట్‌ చేసి, స్వీట్లు పంచుకున్నారు.

Updated Date - 2023-03-19T03:07:55+05:30 IST