వేళాపాళాలేని విద్యుత సరఫరా
ABN , First Publish Date - 2023-08-22T23:55:37+05:30 IST
వ్యవసాయానికి కేటాయించిన సమయంలో విద్యుత ఇవ్వ కుండా ఎప్పుడు పడితే అప్పుడు సరఫరా చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న రైతులు
మడకశిర రూరల్, ఆగస్టు22: వ్యవసాయానికి కేటాయించిన సమయంలో విద్యుత ఇవ్వ కుండా ఎప్పుడు పడితే అప్పుడు సరఫరా చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసా యానికి నిరంతరంగా తొమ్మిది గంటల విద్యుత ఇస్తామన్న ప్రభుత్వం అ మాట నిలుపుకోలేకపోతోందని రైతులు వాపోతున్నారు. విద్యుత ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు వ్యవసాయ బోర్లవద్ద పడికాపులు కాస్తున్నామని అంటున్నారు. అదికూడా సక్రమంగా సరఫరా చేయకపోవడంతో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఐదు వేల వ్యవసాయబోరు బావులు ఉన్నాయి. గతంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత సరఫరా చేసేవారు. ఆది రైతులకు ఎంతో అనుకూలమైన సమయం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఈ యేడు వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ బోర్ల పైనే ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం బోర్ల కింద మొక్కజొన్న, మిరప, టమోటా, రాగి, మల్బరీ వంటి పంటలు సాగుచేశారు. అనధికార విద్యుత కోతలతో వ్యవసాయ బోర్లకు 20 రోజులుగా విద్యుత సరఫరా సక్రమంగా కాకపోవడంతో సాగుచేసిన పంటలు ఎండ ముఖం పడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోని వ్యవసాయబోర్లకు సక్రమంగా విద్యుత సరఫరా ఇవ్వ్వలని రైతులు కోరుతున్నారు.
అధిక లోడ్ వల్లే సమయాల్లో మార్పులు - మహేంద్ర, ఏఈ, విద్యుతశాఖ, మడకశిర
సబ్‌స్టేషన పరిధిలో వ్యవసాయ బోర్లకు ఇస్తున్న విద్యుతకు సంబంధించి లోడు అధికం కావడంతో సరఫరాలో సమయాల్లో మార్పులు చేయాల్సివచ్చింది. వర్షాలు లేని కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయబోర్లపై ఆధారపడ్డారు. దీంతో విద్యుత వినియోగం అధికమైంది. మడకశిర, కల్లుమర్రి, ఆర్ అనంతపురం విద్యుత సబ్‌స్టేషన పరిధిలో వ్యవసాయబోర్లు ఎక్కువగా ఉన్నాయి, విద్యుత వాడకం అధికమైనందున ఆ సబ్‌స్టేషన పరిధిలోని విద్యుత సరఫరాలో మార్పులు చేశాం.