ఇల్లున్నా.. ఇవ్వరు..!
ABN , First Publish Date - 2023-11-21T23:51:37+05:30 IST
గూడులేని నిరుపేదకు పక్కాఇల్లు ఓ కల. ఈ కలను సాకారం చేయాలని టీడీపీ హయాంలో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాల వారికి గృహ వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (ప్రధాన మంత్రి అవాస్ యోజన) అర్బన, ఏహెచపీ (ఆపర్డబుల్ హౌసింగ్ పార్ట్)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) కింద జీ3 సమూనా గృహ సముదాయాలను నిర్మించింది.

టిడ్కో ఇళ్ల పంపిణీ పట్టని ప్రభుత్వం
నిర్మాణాలు పూర్తయినా ఇవ్వకుండా కాలయాపన
విసుగెత్తిపోతున్న లబ్ధిదారులు
వయసు మీరిందని చెప్పి కొన్ని రద్దు
చెల్లించిన సొమ్ము వెనక్కివ్వని వైనం
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా
గృహ సముదాయాలు
పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి
గూడులేని నిరుపేదకు పక్కాఇల్లు ఓ కల. ఈ కలను సాకారం చేయాలని టీడీపీ హయాంలో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాల వారికి గృహ వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (ప్రధాన మంత్రి అవాస్ యోజన) అర్బన, ఏహెచపీ (ఆపర్డబుల్ హౌసింగ్ పార్ట్)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) కింద జీ3 సమూనా గృహ సముదాయాలను నిర్మించింది. కార్పొరేట్ విల్లాలతో పోటీపడేలా అన్ని హంగులతో మూడు కేటగిరీల్లో జీప్లస్ త్రీ భవన సముదాయాలను నిర్మించింది. ఈ ఇళ్లను సొంతం చేసుకునేందుకు అప్పట్లోనే లబ్ధిదారులు పోటీపడి నచ్చిన ప్లాట్ కోసం అప్పు చేసి మరీ డిపాజిట్లు చెల్లించారు. ఇలా జిల్లాలో హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తిలో టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపట్టి అప్పట్లో పూర్తయిన ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించారు. గత సాధారణ ఎన్నికలకు ముందు గృహ ప్రవేశాలు కూడా చేయించారు. ఎట్టకేలకు సొంటింతి కల సాకారమైందని లబ్ధిదారులు సంతోషించారు. ఇంతలోనే వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. టిడ్కో సముదాయాలకు వసతులు సమకూర్చిన తరువాత అందరికీ ఇళ్లు కేటాయిస్తామని పాలకులు, అఽధికారులు చెప్పారు. అలా చేస్తే మరీ మంచిదనుకుని లబ్ధిదారులు భావించారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా గృహాలు మాత్రం నేటికీ దక్కలేదు. టీడీపీ హయాంలో ప్లాట్లను దక్కించుకున్న లబ్ధిదారులకు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మరోసారి ఉగాదికి, వినాయకుచవితి, తరువాత గాంధీజయంతి, క్రిస్మ్‌సకు ప్లాట్లు అప్పగిస్తామని పాలకులు ప్రకటనలు చేస్తూనే వచ్చారు. ఇలా నాలుగున్నరేళ్లు గడిచిపోయినా గృహ సముదాయాలకు వసతులు కాదు కదా.. ఏఒక్క అభివృద్ధి పని చేపట్టిన పాపాన పోలేదు. ఇళ్ల సముదాయాలకు రంగులు మార్చడంతో సరిపెట్టారు. లబ్ధిదారుల జియోట్యాగింగ్ గతేడాది పూర్తి చేశారు. రుణం మంజూరుకు పట్టణాల్లో మూడేళ్ల కిందటే ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. తీరా చూస్తే డబ్బు చెల్లించిన కొందరు లబ్ధిదారులకు 60ఏళ్లు దాటగా.. బ్యాంకులు రుణ మంజూరుకు ఆసక్తి చూపలేదు. సొంత ఇంటిలోకి చేరవచ్చునని సంబరపడిన లబ్ధిదారుల ఆశలపై వైసీపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. చెల్లించిన సొమ్ము ఇవ్వకపోగా కార్యాలయాలు, బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరగడం తప్ప.. ఇళ్ల అప్పగింత ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై లబ్ధిదారులు విసుగెత్తిపోతున్నారు. ప్లాట్లను దక్కించుకుని నాలుగున్నరేళ్లుగా వారికి ఎదురుచూపులే మిగిలాయి.
వాటా చెల్లించినా..
టిడ్కో ఖాతాల్లో ఉండాల్సిన లబ్ధిదారుల వాటా మొత్తాన్ని ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగిండంతో చెల్లింపులు నిలిపివేశారు. ఈనేపథ్యంలో నాలుగున్నరేళ్లుగా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు డబ్బు కోసం తిరుగుతున్నారు. ప్రభుత్వమే పేదలకు మూడు విభాగాల్లో ఇళ్లను నిర్మించింది. 300, 365, 430 చదరపు అడుగుల ప్లాట్లుగా విభజించారు. ఇందులో డబుల్ బెడ్ రూం కల్గిన 430 చదరపు ప్లాట్‌కు రూ.2250 నుంచి రూ.25వేల చొప్పున రెండేసి కంతులు చెల్లించారు. సవాలక్ష నిబంధనలతో చాలామందికి ఇళ్లు మాంజూరు కాని పరిస్థితి. జిల్లాలో వీటి కోసం ఆరేళ్ల కిందటే చాలా మంది లబ్ధిదారులు తమ వంతు వాటా నిధులు చెల్లంచారు. యువ లబ్ధిదారులకు కారణాలు చెప్పకుండా కొందరికి వయసు మీరిందని చెప్పి రద్దు చేశారు. ఇళ్లు మంజూరై ధరావతు కంతులు కట్టిన లబ్ధిదారుల వయోపరిమితి ఏంటని జనం గగ్గోలు పెడుతున్నారు. పాత జాబితాలోని పేదల పేర్లు తొలిగించి, ఇళ్లను అధికార పార్టీ అనుకూలుర పేర్లతో అప్పగించారు.
అసాంఘిక కలాపాలకు అడ్డాగా..
ఆరేళ్ల కిందటే హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో 90శాతందాకా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. టీడీపీ హయాంలో ప్లాట్లు దక్కించుకున్న లబ్ధిదారులకు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాది ప్రారంభంలోనే అప్పగిస్తామని పాలకులు ప్రకటనలు గుప్పించారు. నాలుగున్నరేళ్లు గడిచిపోయినా నిర్మించిన గృహ సముదాయాలకు వసతులు కాదుకదా ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు. ఈనేపథ్యంలో టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక్కడ పేకాట, వ్యభిచారం యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం పట్టణ సమీపంలో కొటిపి రహదారిలో నిర్మించిన టిడ్కో సముదాయం అసాంఘిక కలాపాలకు అడ్డాగా మారింది. కదిరి, పుట్టపర్తి ప్రాంతాల్లో ఊరి చివర సముదాయాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమీప కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.