పెద్దాస్పత్రిలో సిరంజి లేదట!

ABN , First Publish Date - 2023-05-26T23:40:34+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రిలో సర్వం మాయ. ఇక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయినా, ఎన్ని సార్లు రోగులు ఆర్తనాదాలు చేసినా, మరెందరో అధికారులు, పాలకులు గొప్పలు చెప్పినా ఈ ఆస్పత్రిలో మార్పు కనిపించదు.

పెద్దాస్పత్రిలో సిరంజి లేదట!
జిల్లా సర్వజన ఆస్పత్రి

కుక్క కాటు విభాగంలో వింత

అనంతపురం టౌన, మే 26: జిల్లా సర్వజన ఆస్పత్రిలో సర్వం మాయ. ఇక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయినా, ఎన్ని సార్లు రోగులు ఆర్తనాదాలు చేసినా, మరెందరో అధికారులు, పాలకులు గొప్పలు చెప్పినా ఈ ఆస్పత్రిలో మార్పు కనిపించదు. ఏదో ఒక వింత బయటపడుతూనే ఉంది. తాజాగా ఆస్పత్రిలోని కుక్కకాటు విభాగంలో శుక్రవారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఇది. ఇక్కడకు రోజు పదుల సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తుంటారు. శుక్రవారం కూడా పలువురు కుక్కకాటు బాధితులు సూదిమందు కోసం వచ్చారు. వారికి ఏఆర్‌వీ మందు ఉంది. అయితే ఆ మందు వేసే సిరంజిలు లేవు. ఈ సూది వేయడానికి ఏడీ సిరంజి ఉండాలి. సూది వేసిన తర్వాత వెంటనే ఆ సిరంజిని డిస్పోజ్‌ చేస్తారు. మామూలు సిరంజిలతో వేయరు. కుక్కకాటుకు మందు వేసే సిరంజిలు లేకపోవడంతో నర్సులు బాధితులకు బయట తీసుకొని రావాలని చీటీ రాసిచ్చారు. చేసేది లేక బాధితులు బయట మందుల షాపులో కొనుక్కోని పోయి కుక్కకాటుకు ఇంజక్షనలు ఆస్పత్రిలో వేయించుకున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులను విలేకరులు ప్రశ్నించగా స్టాక్‌ అయిపోయాయి లోకల్‌గా కొనుగోలు చేశాం. రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Updated Date - 2023-05-26T23:40:34+05:30 IST