అధికార పార్టీ జోక్యంతోనే ఆలయాల్లో చోరీలు

ABN , First Publish Date - 2023-09-21T23:41:20+05:30 IST

అధికార పార్టీ జోక్యంతోనే ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ విమర్శించారు.

అధికార పార్టీ జోక్యంతోనే ఆలయాల్లో చోరీలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 21: అధికార పార్టీ జోక్యంతోనే ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ విమర్శించారు. గురువారం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీలను సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈఓ చాంబర్‌లో ఈఓ వెంకటేశ్వరరెడ్డితో చోరీ సంఘటనపై, ఆలయంలో జరుగుతున్న ఆక్రమాలపై చర్చించారు. అనంతరం ఆలయం బయట విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారన్నారు. ఆలాంటి ఆలయంలో ఆరు నెలల నుంచి హుండీలో దొంగతనం జరగుతున్నట్లు ఆలయ పాలకమండలి సభ్యుడు చెప్పారన్నారు. హుండీల్లో నుంచి దొంగతనం చేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డు కృష్ణారెడ్డి హుండీలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడన్నారు. కృష్ణారెడ్డితో పాటు అతని వెనుక ఉన్న అసలు దొంగలు, అదృశ్య శక్తులు ఎవరు? అధికార పార్టీ నాయకులు, అధికారుల హస్తం ఉన్న భాగస్వాములను బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుండీ దొంగతనంపై స్ధానిక ఎమ్మెల్యే, జిల్లా ఇనచార్జి మంత్రి స్పందించాలన్నారు. కృష్ణారెడ్డిని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, రాము, రామాంజనేయులు, ఈశ్వరయ్య, ఉమర్‌ బాషా, మురళి, వెంకట్‌నాయక్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:41:20+05:30 IST