సమ్మె ఉధృతం
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:02 AM
నగరపాలిక పరిధిలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజు కొనసాగింది. కార్పొరేషన కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
నగరంలో పేరుకుపోయిన చెత్త
తరలింపును అడ్డుకున్న కార్మికులు
అనంతపురం క్రైం, డిసెంబరు 27: నగరపాలిక పరిధిలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజు కొనసాగింది. కార్పొరేషన కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి, క్రిస్టియన మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్, టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు, సీపీఎం జిల్లా నాయకురాలు సావిత్రి, సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటనారాయణ, టీఎనటీయూసీ నగర అధ్యక్షుడు పూల బాషా, టైలర్ యూనియన అధ్యక్షుడు ముత్యాలు, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు మంజుల నారాయణ, సుధాకర్, నవీన తదితరులు మద్దతు తెలిపారు.
అడ్డుకున్న కార్మికులు
కార్పొరేషన ఉన్నతాధికారులు నగరంలో చెత్త తొలగింపు పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. వారు ట్రాక్టర్లతో చెత్తను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు ఆధ్వర్యంలో ట్రిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పాతూరులోని పవర్‌ఆఫీస్ ఎదుట వాహనంలోని చెత్తను కిందపడేశారు. చెత్త తరలింపునకు వాహనాఉల వెళ్లకుండా టైౖర్లలో గాలి తీసేశారు. గ్యాంగ్ వర్క్‌లకు వెళ్తున్న రెగ్యులర్ కార్మికులను అడ్డుకున్నారు.
నగరం చెత్తమయం
కార్మికుల సమ్మె కారణంగా నగరంలోని చెత్తాచెదారం పేరుకుపోయింది. డంపర్ బిన్స నిండి, చెత్త రోడ్డుపైకి చేరింది. రామ్‌నగర్, ఉపాధ్యాయ భవన, పాతూరులోని పలు సర్కిళ్లల్లో, కమలానగర్‌లోని డీసీఎంఎస్ రోడ్డులో చెత్త రోడ్లపైకి చేరింది. గుల్జార్‌పేటలో మసీదు సమీపంలో పరిస్థితి దారుణంగా తయారైంది. చెత్తాచెదారంతో కాలువ పూడిపోయి.. మురుగునీరు పొంగిపోతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. కాలు బయట పెట్టడానికి వీలు లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.