Share News

జగనన్న ఇళ్లలో నాణ్యత డొల్ల

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:19 PM

జగనన్న కాలనీల్లో వైసీపీ ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఆప్షన-3 ద్వారా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగనన్న ఇళ్లలో నాణ్యత డొల్ల
బండమీదపల్లిలో నాసిరకంగా నిర్మిస్తున్న జగనన్న ఇళ్లు

అయోమయంలో లబ్ధిదారులు

రాప్తాడు, డిసెంబరు 17: జగనన్న కాలనీల్లో వైసీపీ ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఆప్షన-3 ద్వారా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాప్తాడు మండలంలో ఆప్షన-3 ద్వారా ఏడాది క్రితం మొత్తం 357 ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు తీసుకుని పేదలకు ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఒప్పందం చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు చేసేందుకు కలకత్తా, బీహార్‌ రాష్టాల నుంచి కాంట్రాక్టర్లు కూలీలను రప్పించారు. మండలంలోని గాండ్లపర్తిలో 66, గొందిరెడ్డిపల్లిలో 1, బండమీదపల్లిలో 44, పాలచెర్లలో 41, రాప్తాడులో 62, ప్రసన్నాయపల్లిలో 143 గృహాల నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించలేదు. ఏదో నామమాత్రంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కట్టిన గోడలు నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. సిమెంటు ఇటుకలు పేర్చి వాటికి సరిగ్గా సిమెంటు కూడా వేయలేదు. గోడలకు అమర్చిన తలుపు, కిటికీలు పట్టుకుంటే ఊడేలా ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు వాపోతున్నారు. పలు గ్రామాల్లో చాలా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. నిర్మాణ పనులు స్లాబ్‌ లెవల్‌ వరకూ మాత్రమే పూర్తి చేశారు. ఆ తరువాత పనులు ఆపేశారు. ఇళ్లు నిర్మించే కూలీలు తమ రాష్టాలకు వెళ్లిపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ విషయంపై మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ పవనకుమార్‌ మాట్లాడుతూ.. మండలం ఇప్పటిదాకా ఆప్షన-3 ద్వారా 37 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగతావి త్వరలోనే పూర్తి చేయిస్తామని అన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:19 PM