వడదెబ్బ మరణాలు లేవట!

ABN , First Publish Date - 2023-06-03T00:43:43+05:30 IST

జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు.

వడదెబ్బ మరణాలు లేవట!

జిల్లాలో మండుతున్న ఎండలు

పలువురికి అస్వస్థత.. కొందరి మరణం

ఒక్క మరణాన్నీ నమోదు చేయని వైనం

బాధిత కుటుంబాలకు అందని పరిహారం

త్రిసభ ్య కమిటీల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు. వందల మంది ఆస్పత్రులపాలయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది శ్రమజీవులు ఉన్నారు. కానీ వైద్యశాఖ మాత్రం ఈ వేసవిలో వడదెబ్బతో ఒక్కరు కూడా చనిపోలేదని చెబుతోంది. వడదెబ్బతో మరణించిన వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందుతుంది. వడదెబ్బ మరణాలను జాతీయ విపత్తుల కింద సంభవించినవిగా పరిగణించి.. ఆదుకుంటారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఇస్తారు. అర్హుల ఎంపిక కోసం త్రిసభ్యకమిటీని నియమించారు. ఈ కమిటీలో తహసీల్దారు, వైద్యాధికారి, ఎస్‌ఐ ఉంటారు. ఎఫ్‌ఐర్‌, పోస్టుమార్టం, మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా వడదెబ్బ మరణాలను గుర్తిస్తారు. ఈ కమిటీ ఈ ఏడాది ఇప్పటి వరకు వడదెబ్బతో ఎవరు మరణించలేదని అంటోంది. దీంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వ సాయాన్ని పొందలేకపోతున్నాయి.

- అనంతపురం టౌన

వడదెబ్బ మరణాలే..

శింగనమల మండలం గోవిందరాయపేటకు చెందిన ఉపాధి కూలీ

ఇమామ్‌ హుసేన(47) ఏప్రిల్‌ 17న వడదెబ్బకు గురై మృతి చెందారు. పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన లక్ష్మిదేవి(60) వడదెబ్బకు గురై మరణించారు. ఇదే మండలంలో బ్యాంకుకు వచ్చిన రైతు వెంకటరామిరెడ్డి ఎండకు సొమ్మసిల్లి, గుండెపోటుతో మరణించారు. యాడికిలో మే 20న విధుల్లో ఉన్న వీఆర్‌ఏ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇలా అనేక మంది ఈ వేసవిలో వడదెబ్బకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కానీ ఒక్కటి కూడా వడదెబ్బకు గురై మరణించినట్లు నమోదు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అవగాహన ఏదీ..?

రెండు నెలలుగా పగటి ఉష్ణోగ్రతలు జిల్లాలో అమాంతంగా పెరిగాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ పనికి వెళితేగాని పూట గడవని కూలీలు, కార్మికులకు తప్పలేదు. మండే ఎండలో పనులు చేస్తూ.. వడదెబ్బ బారిన పడ్డారు. కొందరు చికిత్స పొంది కోలుకోగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ మరణాలను నమోదు చేయించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. వడదెబ్బతో మరణిస్తే పరిహారం అందుతుందని తెలిసినా, అందుకు త్రిసభ్య కమిటీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయించాలన్న విషయం చాలామందికి తెలియదు. ఈ దిశగా చొరవ చూపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.

త్రిసభ్య కమిటీ ఎక్కడ..?

వడదెబ్బ మరణాలను గుర్తించేందుకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కనిపించడం లేదు. వడదెబ్బకు గురై మరణిస్తే, ఆ మండల వైద్యాధికారి మరణ ధ్రువీకరణ చేయాలి. తహసీల్దారు పంచనామా నివేదిక ఇవ్వాలి. స్టేషన ఎస్‌ఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఈ మూడు ఉంటేనే వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. కానీ త్రిసభ్య కమిటీ తమకు సంబంధమే లేదన్నట్లు మిన్నకుండిపోతోంది. మరోవైపు ఆ ముగ్గురు అధికారులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలకు అంతో ఇంతో ఆసరా అయ్యే సాయం అందకుండాపోతోంది.

Updated Date - 2023-06-03T00:43:43+05:30 IST