Share News

ఖాతా కష్టాలు..!

ABN , First Publish Date - 2023-11-20T00:12:03+05:30 IST

ఇప్పటిదాకా ఈ సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాలో జమచేస్తున్న ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇకనుంచి ఈ రెండు పథకాల ద్వారా విద్యార్థులు లబ్ధి పొందాలంటే ప్రతి విద్యార్థి వారి తల్లితో కలిసి జాయింట్‌ ఖాతాను తెరవాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో జాయింట్‌ ఖాతాను తెరవడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతున్నారు.

ఖాతా కష్టాలు..!
బ్యాంకులో ఖాతా తెరవడానికి వేచివున్న విద్యార్థులు

విద్యాదీవెన వర్తింపునకు నిబంధనలు

జాయింట్‌ అకౌంట్‌ తప్పనిసరి చేసిన వైనం

బ్యాంకుల్లో విద్యార్థుల పడిగాపులు

తరగతులకు గైర్హాజరవుతున్న వైనం

కొత్తచెరువు

ఇంటర్మీడియేట్‌ తరువాత ఇంజనీరింగ్‌, డిప్లమా కోర్సులను అభ్యసిస్తున్న వారికి ప్రభుత్వం విద్యాదీవెన పథకం ద్వారా స్కాలర్‌షిప్‌ అందజేస్తోంది. వసతిదీవెన పథకం ద్వారా ఏడాదికి మరో రూ.20వేలు విద్యార్థులకు ఇస్తోంది. ఇప్పటిదాకా ఈ సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాలో జమచేస్తున్న ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇకనుంచి ఈ రెండు పథకాల ద్వారా విద్యార్థులు లబ్ధి పొందాలంటే ప్రతి విద్యార్థి వారి తల్లితో కలిసి జాయింట్‌ ఖాతాను తెరవాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో జాయింట్‌ ఖాతాను తెరవడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతున్నారు.

నిబంధనలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి

జాయింట్‌ ఖాతాను తెరచిన తరువాత నవశకం పోర్టల్‌లో ఆ ఖాతా వివరాలు ఈనెల 24వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. ఇందుకు సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో బ్యాంకులు.. విద్యార్థులు, వారి తల్లులతో కిటకిటలాడుతున్నాయి.

ఖాతా తెరచినవారికే విద్యాదీవెన సొమ్ము

2023-24 సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత విద్యాదీవెన సొమ్ము జాయింట్‌ ఖాతా తెరచినవారికే జమవుతుంది. దీంతో విద్యార్థులు దూరప్రాంతాల నుంచి కాలేజీలను సైతం వదిలిపెట్టి ఉమ్మడి ఖాతా తెరవడానికి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ పథకాన్ని కుదించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కొత్తఖాతా తెరవడానికి ఇబ్బందులు ఎన్నో..

కొత్తగా ఖాతా తెరవడానికి బ్యాంకులు అనేక నిబంధనలు పెడుతున్నాయి. ఇప్పటికే విద్యార్థికి ఖాతా ఉంటే అందులో తల్లి పేరును చేర్చే వీలు కల్పించినప్పటికీ ఆ ఖాతాకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌కార్డు సదుపాయాలు ఉండకూడదన్న నిబంధన విధించాయి. ఈ ఖాతాల ప్రారంభానికి అవసరమైన డాక్యుమెంట్ల కోసం రూ.200 నుంచి రూ.500 ఖర్చు అవుతోందని పలువురు వాపోతున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల తాము తరగతులను కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T00:12:09+05:30 IST