ఆగిన ఎత్తిపోతలు..!

ABN , First Publish Date - 2023-03-31T00:28:15+05:30 IST

హంద్రీనీవాలో గతేడాది కంటే తక్కువ పరిమాణంలో ఎత్తిపోతలు జరిగాయు.

ఆగిన ఎత్తిపోతలు..!

రాగులపాడు పంప్‌హౌస్‌ నుంచి నీటి విడుదలకు బ్రేక్‌

హంద్రీనీవా.. 23.7 టీఎంసీలకే పరిమితం

ప్రతి ఏటా తగ్గుతున్న కేటాయింపులు

గుంతకల్లు, మార్చి 30: హంద్రీనీవాలో గతేడాది కంటే తక్కువ పరిమాణంలో ఎత్తిపోతలు జరిగాయు. మూడు రోజుల కిందట హంద్రీనీవాలో నీటి పంపింగ్‌ నిలిచిపోయింది. ముచ్చుమర్రి పంప్‌హౌస్‌ వద్ద డ్యాం నుంచి నీటి ఎత్తిపోతలు ఐదు రోజుల కిందట నిలిచిపోగా, మూడు రోజుల తర్వాత జిల్లాలోని రాగులపాడు పంప్‌హౌస్‌ మోటార్లు కూడా ఆగిపోయాయి. గత సంవత్సరం కంటే ఒక నెల ఎక్కువగా ఈ సంవత్సరం మార్చి వరకూ నీరు సరఫరా చేసినా నీటి పరిమాణం మాత్రం గతేడాది కంటే తక్కువగా నమోదైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరం మాత్రం 40 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేశారు. తర్వాత రెండేళ్ల నుంచీ నీటి ఎత్తిపోతలు మందగిస్తూ వస్తున్నాయి. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం హంద్రీనీవాలో దాదాపు రెండు టీఎంసీలు తక్కువగా నీటి పారుదల జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

23.7 టీఎంసీలకే పరిమితం

హంద్రీనీవాలో ఈ సంవత్సరం కేవలం 23.7 టీఎంసీల నీరు మాత్రమే ప్రవహించింది. ఈ సీజనలో 2022 జూలై 20వ తేదీన హంద్రీనీవాలో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 8 నెలలపాటు నీరు లభించినా కనీసం 30 టీఎంసీల నీరు కూడా కేటాయించలేకపోయారు. గత సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీ వరకూ నీటి ఎత్తిపోతలు జరగ్గా 25.56 టీఎంసీల నీరు లభించింది. ఈ సంవత్సరం మరో 20 రోజులపాటు ఎక్కువగా పంపింగ్‌ జరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. 2020-21లో గరిష్టంగా 40 టీఎంసీలు కేటాయించారు. 2020-21తో పోలిస్తే గత సంవత్సరం 14.5 టీఎంసీల నీరు తక్కువగా వచ్చింది. ఇక గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రెండు టీఎంసీల మేర నీటికోత విధించారు. మొత్తంమీద ఉమ్మడి జిల్లాలకు కలిపి ఈ సీజనలో 23.7 టీఎంసీల మాత్రమే నీటి కేటాయింపు జరగ్గా అనంతపురం జిల్లాలోకి 19.3 టీఎంసీల నీరు వచ్చినట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు.

అడుగడుగునా ఆటంకాలే...

రెండేళ్లుగా పరిశీలిస్తే ఏపీ, తెలంగాణ రాషా్ట్రలు విద్యుదుత్పత్తి కోసం ఇష్టానుసారంగా శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వలను వినియోగించారు. దీంతో నీటి కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. గత సంవత్సరం నవంబరులో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. డ్యాంలో నీరు తగ్గడంతో డిసెంబరు ఆఖరుకు హంద్రీనీవాకు నీరు నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొత్తగా పంటలు పెట్టవద్దని నవంబరులోనే అధికారులు రైతులను హెచ్చరించారు. అయితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్చల ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించాయి. కానీ వర్షాలకు, తెగుళ్లవల్ల పప్పుశనగ, మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ పంటలు పెట్టలేక నష్టపోయారు. చివరి దశలో ఉన్న పంటలకు నీరిచ్చేందుకు హంద్రీనీవాకు తక్కువ పరిమాణంలోనైనా మార్చి వరకూ నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఫిబ్రవరిలోనే డ్యాం నీరు తగ్గిపోవడంతో మల్యాల పంప్‌హౌస్‌ నుంచి పంపింగ్‌ను ఆపివేసి ముచ్చుమర్రి పంప్‌ హౌస్‌ నుంచి హంద్రీనీవాకు నీరిచ్చారు. దాదాపు నెలపాటు రెండు పంపులను ఉపయోగించి తక్కువ మోతాదుతో నీటిని ఎత్తిపోశారు. చివరకు మార్చి 25వ తేదీన హంద్రీనీవాలో ఎత్తిపోతలను నిలిపివేశారు.

Updated Date - 2023-03-31T00:28:15+05:30 IST