Share News

శింగనమల హైడ్రో ప్రాజెక్టు ఎన్నికల ఎండమావి కాకూడదు : సీపీఎం

ABN , First Publish Date - 2023-12-01T00:26:06+05:30 IST

శింగనమల మండలం నాయినివారిపల్లి వద్ద పంప్డ్‌ స్టోరేజి హైడ్రో ప్రాజెక్టు జిల్లాలో మరో ఎన్నికల ఎండమావిగా మారకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ అభిప్రాయపడ్డారు.

శింగనమల హైడ్రో ప్రాజెక్టు   ఎన్నికల ఎండమావి కాకూడదు : సీపీఎం

అనంతపురం కల్చరల్‌, నవంబరు 30: శింగనమల మండలం నాయినివారిపల్లి వద్ద పంప్డ్‌ స్టోరేజి హైడ్రో ప్రాజెక్టు జిల్లాలో మరో ఎన్నికల ఎండమావిగా మారకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ అభిప్రాయపడ్డారు. గురువారం స్థానిక గణేనాయక్‌ భవనలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన అనంతపురం జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు స్థాపించి సాగునీటి వనరులను పెంచాలని అనేక సంవత్సరాలుగా జిల్లా ప్రజలు, తమ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో శింగనమలలో హైడ్రో ప్రాజెక్టు రావడాన్ని సీపీఎం హర్షిస్తోందన్నారు. అయితే 1200 ఎకరాల్లో రూ. 4600 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు కీలకమైన సుమారు ఒక టీఎంసీ నీరు ఎక్కడ నుంచి తెస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాకాలంలో మిగులు జలాలను 54 మీటర్ల ఎత్తుకు పంపుచేసి, తిరిగి ఆ నీటిని దిగువకు పంపి అందులో 800 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తామనడం ఎండమావి లాంటిదేనని విమర్శించారు. గతంలో ఎన్నికల సమీప సమయంలో హడావుడిగా జిల్లాకు ప్రకటించిన అనేక పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు దిష్టిబొమ్మల్లా ఉన్నాయన్నారు. హీరేహల్‌ మండలంలో ఖుద్రేముఖ్‌ ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అది అర అంగుళం పని కూడా జరగలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో నాలుగు బిందు సేధ్య పథకాల ద్వారా 49,918 ఎకరాలకు నీరందించేందుకు పనులను ప్రారంభించినా నేటికీ అమలు కాలేదన్నారు. బీటి ప్రాజెక్టు కాలువ తవ్వకాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. హంద్రీనీవా మొదటిదశ ద్వారా 1.52 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలన్నారు. 12 సంవత్సరాలుగా నీరు వస్తున్నా ఒక్క ఎకరానికీ సాగునీరివ్వలేదన్నారు. ఎన్నికల ముందు ప్రకటించే ఇలాంటి పథకాలు జిల్లా ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికేననే గత అనుభవం చెబుతోందన్నారు. జిల్లా అభివృద్ధి కోసమే శింగనమల హైడ్రో ప్రాజెక్టు నిర్మిస్తుంటే దానికి నికర నీటి కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-12-01T00:26:09+05:30 IST