Share News

ఆర్బాటమే..

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:54 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం గా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది.

ఆర్బాటమే..

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 26ః రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం గా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. మంగళవారం స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో క్రీడా పోటీల ప్రారంభోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామన 7గంటలకే వణికే చలిలో విద్యార్థులను తీసుకురావడంతో చాలా మంది కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో స్టేడియం వెలవెలబోయింది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులతో క్రీడాపోటీల నిర్వహణ కాస్తా నవ్వులపాలయ్యింది. సరైన యూనిఫాం, నీటి వసతి కూడా లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. క్రీడా పోటీలు రాజకీయ వేదికగా ప్రభుత్వం భావించడం గమనార్హం. క్రీడలు, క్రీడాకారుల తో సంబంధం లేకుండా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలనే తపన ప్రభుత్వ వైఖరిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సీఎం జగన బొమ్మతో ఇచ్చిన కిట్లు నాసిరకంగా ఉండడం పట్ల అటు క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రీడలతో సం బంధం లేని నగరపాలక సంస్థ, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వాహకులుగా వ్యవహరిస్తుండడంతో పీడీలు, పీఈటీలు, కోచలను విస్మరించి ఇతరులతో క్రీడాపోటీలు నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీటీసీ మైదానం లో అటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా పరిస్థితిని మార్చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఉపయోగం లేని సర్టిఫికెట్లు ఇస్తామనడం, నైపుణ్యత లేని క్రీడాకారులు, ఇతరులను పోటీలకు దింపడం పట్ల అసలైన సిసలైన క్రీడాకారులు కార్యక్రమానికి దూరంగా ఉండడం కొసమెరుపు. మొదటి రోజే ఇలా అస్త్యవస్తంగా నిర్వహించడం పలువురు క్రీడాభిమానులు, క్రీడాకారులు నవ్వుకోవడం వారి వంతైంది. ఆర్ట్స్‌ కాలేజ్‌, న్యూటౌన బాలుర జూనియర్‌ కళాశాల మైదానాల్లో నిర్వహించిన క్రికెట్‌ పోటీలకు క్రీడాకారులు లేక అక్కడ ఉన్న వారినే ఎటువంటి యూనిఫాం, బూట్లు లేని వ్యక్తులను ఆడించడం శోచనీయం. 15సంవత్సరాలు పైబడిన వయోపరిమితి లేకుండా ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు అర్హులని ప్రభుత్వం చెప్పడం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదంతా ఎన్నికల స్టంట్‌ అంటూ యువత హేళన చేస్తున్నారు. క్రీడలంటే నైపుణ్యత, నాణ్యత కలిగిన క్రీడాకారులను భాగస్వాములను చేయడం, ప్రోత్సహించడం. అటువంటివి కనుచూపుమేరలో కనపడకపోవడంతో క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వానికి ఎంత మేర చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది. ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు మొదటి రోజే ఇలా ఉంటే ఇక చివరి రోజు వరకు ఎలా కొనసాగిస్తారో ప్రభుత్వానికే వదిలేయాల్సిందే.

Updated Date - Dec 26 , 2023 | 11:54 PM