స్కూల్ నిధులు రివర్స్!
ABN , First Publish Date - 2023-12-11T00:54:27+05:30 IST
వైసీపీ పాలనలో అన్నీ రివర్స్ నిర్ణయాలే. రివర్స్ టెండరింగ్‌తో అభివృద్ధి పనులు అటకెక్కాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బడుల విషయంలోనూ రివర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... వెనక్కు లాగేస్తోంది ప్రభుత్వం.
ఇచ్చినట్టే ఇచ్చి.. వెనక్కు..!
నాడు-నేడు తొలిదశ స్కూళ్లకు నిర్వహణ నిఽధులు
960 స్కూళ్లకు రూ.16.89 కోట్లు విడుదల
అందులో రూ.7.87 కోట్లు ఇతర జిల్లాలకు సర్దుబాటు
మండిపడుతున్న ఉపాధ్యాయులు
- జిల్లా కేంద్రంలోని పాతూరులో గల నంబర్ 2 స్కూల్. తొలివిడత నాడు-నేడు స్కూళ్ల నిర్వహణ నిధులు రూ.4.65 లక్షలు ఇటీవల కేటాయించారు. అలా డబ్బు వచ్చాయో.. లేదో.. అందులో సగం అంటే రూ.2.35 లక్షలు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు స్కూల్‌కు సర్దుబాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 960 స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
- జిల్లాలోని కూడేరు మండలంలోని ఓ స్కూల్. ఇటీవలే ఈ స్కూల్‌కు ఎస్‌ఎంఎఫ్ కింద డబ్బు పడ్డాయి. అమ్మయ్యా... లేక లేక స్కూల్ ఖాతాలో డబ్బు పడ్డాయంటూ ప్రధానోపాధ్యాయుడు అందులోంచి సుమారు రూ.90 వేలకుపైగా గతంలో నాడు-నేడు పనులు చేసినందుకు ఉన్న అప్పులు, ఇతర ఖర్చుల కోసం వాడేసుకున్నారు. ఇలా అనేక స్కూళ్లలో హెచఎంలు పడిన డబ్బుల్లోంచి ఖర్చులు, అప్పులకు ఫండ్ డ్రా చేశారు. తాజాగా ఖాతాల్లో వేసిన డబ్బుల్లోంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయమని పైఅధికారులు చెబుతుండటంతో హెచఎలం తలలు పట్టుకుంటున్నారు.
అనంతపురం విద్య, డిసెంబరు 10: వైసీపీ పాలనలో అన్నీ రివర్స్ నిర్ణయాలే. రివర్స్ టెండరింగ్‌తో అభివృద్ధి పనులు అటకెక్కాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బడుల విషయంలోనూ రివర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... వెనక్కు లాగేస్తోంది ప్రభుత్వం. అనంతపురం జిల్లాలోని పాఠశాలలకు నాడు-నేడు మొదటి దశ స్కూల్ మెయింటెనెన్స ఫండ్ (ఎస్‌ఎంఎఫ్) కింద నిధులు విడుదల చేసి... తర్వాత అందులో సగం ఇతర జిల్లాలకు పంచేందుకు సిద్ధమైంది. జిల్లాలోని స్కూళ్లకు ఇచ్చిన నిధులను ఇతర జిల్లాలకు మళ్లీ సర్దుబాటు చేయనుండటంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాకు సుమారు రెండు నెలల క్రితం రూ. 16.98 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మళ్లీ అందులోంచి రమారమి 8 కోట్ల రూపాయలను 11 జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు సిద్ధమైంది. నిధులు విడుదల చేసిన వెంటనే కొందరు ప్రధానోపాధ్యాయులు గతంలో నాడు-నేడు కోసం చేసిన అప్పులు, ఇతర ఖర్చుల కోసం వాడేసుకున్నారు కూడా. ఆలస్యంగా సర్దుబాటు ఉత్తర్వులివ్వడంతో గందరగోళం ఏర్పడింది. జిల్లాలోని స్కూళ్లకు ఇచ్చిన నిధుల్లోంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయడంపై కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
960 స్కూళ్లకు నిధులు...
వైసీపీ అధికారం చేపట్టిన మొదట్లో జిల్లావ్యాప్తంగా నాడు -నేడు తొలి దశలో స్కూళ్లలో అభివృద్ధి పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా భవన నిర్మాణాలు, మరమ్మతులు, డెస్కుల పంపిణీ, ఎలక్ర్టిఫికేషనతోపాటు లక్షల విలువైన ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గతంలో ఆయా స్కూళ్ల నిర్వహణ కోసం స్కూల్స్ మె యింటెనెన్స ఫండ్ (ఎస్‌ఎంఎఫ్) పెద్దగా విడుదల చేయలేదు. జిల్లావ్యాప్తంగా 960 స్కూళ్లకు రెండు నెలల కిందట నిధులు విడుదల చేశారు. స్కూళ్ల స్థాయిని బట్టి నిధులు కేటాయించారు. నాడు-నేడు పనులు చేసే క్రమంలో కిందరు హెచఎంలు అప్పులు, ఇతర ఖర్చులకు చేతి నుంచి కూడా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఉన్నఫలంగా తమ స్కూళ్ల ఖాతాల్లోకి డబ్బు వేయడంతో, కొందరు చూసుకోలేదు కూడా. ఫండ్స్ పడిన విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు గతంలో చేసిన ఖర్చుల అప్పులకు ఖర్చు చేశారు. మరికొందరు స్కూళ్లలో ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు.
11 జిల్లాలకు సర్దుబాటు
జిల్లాలో నాడు-నేడు మొదటి విడతలో 960 స్కూళ్లకు రెండు నెలల కిందట రూ. 16.89 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ నిధులను ఇతర జిల్లాల స్కూళ్లకు అధికారులు సర్దుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అనంత స్కూళ్ల నుంచి ఎన్టీఆర్, అన్నమయ్య, బాపట్ల, మన్యం, విశాఖపట్నం, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, వైఎ్‌సఆర్ కడప, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని స్కూళ్లకు సర్దుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలోని స్కూళ్లకు జమ చేసిన డబ్బులోంచి ఇతర జిల్లాల స్కూళ్లకు కొన్నింటి నుంచి సగం డబ్బు వెనక్కు తీసుకుంటుంటే... మరికొన్ని స్కూళ్ల నుంచి కొంత మేర సర్దుబాటు చేసేయనున్నారు. జిల్లా నుంచి ఏకంగా రూ.7.87 కోట్లు 11 జిల్లాకు సర్దుబాటు చేసేందుకు రెడీ అయ్యారు. జిల్లాలోని స్కూళ్లకు కేటాయించిన డబ్బును ఇతర జిల్లాలకు ఇస్తుండటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ సర్కారు తీరుపై పెదవి విరుస్తున్నారు.
నిధుల మళ్లింపు సరికాదు
నాడు-నేడు మొదటిదశ స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు, కొళాయిలు, నీటి సరఫరా ఇతర మరమ్మతు పనులు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారీగా నిధులు సరిపడా విడుదల చేయకపోగా.... జిల్లా స్కూళ్లకు ఇచ్చిన వాటిని ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయడం సరికాదు.
- విజయ్‌భాస్కర్, ఏపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
అన్ని స్కూళ్లకు నిధులు కేటాయించాలి
నాడు-నేడు తొలి దశ స్కూళ్లకు కేటాయించిన నిధులను ఇతర జిల్లాలకు మళ్లించడం సబబుకాదు. స్కూళ్లలో పనులు పూర్తికాకపోగా... ఇప్పటికే ఇచ్చిన నిధులను మళ్లీ ఇతర జిల్లాలకు మళ్లిచాలనుకోవడం దారుణం. వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలి. అన్ని పాఠశాలలకు నిధులు కేటాయించాలి. అనంత జిల్లా స్కూళ్లు, విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- లింగమయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
50 శాతం ఫండ్ సర్దుబాటు తగదు
స్కూళ్లకు ఇప్పటి వరకూ గ్రాంట్స్ విడుదల చేయలేదు. దీంతో టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాడు-నేడు స్కూళ్లకు నిర్వహణ కోసం నిధులు విడుదల చేసినట్టే చేసి ఇప్పుడు సుమారు 50 శాతం ఫండ్స్ ఇతర జిల్లాలకు కేటాయించాలనుకోవడాన్ని ఖండిస్తున్నాం. స్కూళ్లకు అవసరం మేరకు నిధులు కేటాయించాలి.
- సిరాజుద్దీన, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి