Share News

అదే హోరు..!

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:37 AM

సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీలు చేపట్టిన ఆందోళనలు ఐదో రోజు కొనసాగాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా బాధితులు రోడ్లపైకి వచ్చారు. అన్ని మండలాల్లో వర్కర్లు, ఆయాలు ఎర్రచీరలు ధరించి, నల్ల రిబ్బన్లు కళ్లకు, నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. అనంతపురంలోని కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అదే హోరు..!
కలెక్టరేట్‌ వద్ద నిరసన

ఐదోరోజూ తగ్గని అంగనవాడీలు

జిల్లావ్యాప్తంగా నల్ల రిబ్బన్లతో నిరసన

అనంతపురం విద్య, డిసెంబరు 16: సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీలు చేపట్టిన ఆందోళనలు ఐదో రోజు కొనసాగాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా బాధితులు రోడ్లపైకి వచ్చారు. అన్ని మండలాల్లో వర్కర్లు, ఆయాలు ఎర్రచీరలు ధరించి, నల్ల రిబ్బన్లు కళ్లకు, నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. అనంతపురంలోని కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు శిబిరంలో ప్రసంగించారు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామన్న వైఎస్‌ జగన.. రాష్ట్రంలో ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కృషిచేస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా తలుపులు తెరిపించి, అంగనవాడీల నోరు మూయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే జైౖౖళ్లకైనా పంపాలని అన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలని జగననే చెబుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

- కలెక్టరేట్‌ వద్ద అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు వేపాకు తింటూ నిరసన తెలిపారు. రెండు చేతుల్లో వేపాకు మండలు పట్టుకుని, అమ్మోరు పూనినట్లుగా ఓ కార్యకర్త నిరసన తెలిపారు. పూనకంతో ఊగిపోతున్న అమ్మోరును శాంతించాలని అంగనవాడీలు కోరగా, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అమ్మోరు పలికినట్లుగా నటిస్తూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

- గార్లదిన్నె, ఉరవకొండ, శింగనమల, గుత్తి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, కూడేరు తదితర ప్రాంతాల్లో అంగనవాడీలు ఆందోళనలు కొనసాగించారు. అనంతపురంలోని రాణీనగర్‌, అనంతపురం రూరల్‌ మండలంలోని మన్నీల తదితర ప్రాంతాల్లోని అంగనవాడీ కేంద్రాల తలుపులను అధికారులు పగలగొట్టించారు.

అంగనవాడీల డిమాండ్లు నెరవేరుస్తాం

మాజీ మంత్రి కాలవ

కణేకల్లు, డిసెంబరు 16: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగనవాడీ టీచర్ల డిమాండ్లను నెరవేరుస్తామని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలకేంద్రంలో సమ్మె చేస్తున్న అంగన వాడీల శిబిరాన్ని శనివారం సందర్శించిన ఆయన వారితో మాట్లాడారు. ఇప్పటికే తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు తాము అధికారంలో వస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. న్యాయబద్ధ డిమాండ్ల కోసం అంగనవాడీలు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వైసీపీ నాయకుల సహకారంతో మూసిన అంగనవాడీ సెంటర్ల తాళాలను పగులగొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అంగనవాడీలకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, బీటీ రమేష్‌, షేక్‌ముజ్జు, అనిల్‌, చాంద్‌బాషా, మాబుసాబ్‌, సీఐటీయూ మండల కార్యదర్శి కోరి నాగరాజు, అంగనవాడీల అధ్యక్షురాలు పార్వతి, కార్యదర్శి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:37 AM