Share News

ఎన్నికల్లో బుద్ధి చెబుదాం

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:13 PM

ఓట్లు వేయించుకుని, ఉద్యోగులను వదిలేసిన ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన విజయ్‌ హెచ్చరించారు. సమ్మెలో భాగంగా 7వ రోజు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద హుండీలు పట్టుకుని భిక్షాటన చేశారు.

ఎన్నికల్లో బుద్ధి చెబుదాం
భిక్షాటన చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

ప్రభుత్వానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల హెచ్చరిక

అనంతపురం విద్య, డిసెంబరు 26: ఓట్లు వేయించుకుని, ఉద్యోగులను వదిలేసిన ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన విజయ్‌ హెచ్చరించారు. సమ్మెలో భాగంగా 7వ రోజు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద హుండీలు పట్టుకుని భిక్షాటన చేశారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చిన జగన, నాలుగున్నరేళ్లుగా పట్టించకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మినహా విద్యాశాఖ మంత్రికి, గత విద్యాశాఖ మంత్రి, మినిస్టర్స్‌ సబ్‌ కమిటీకి పలుమార్లు సమస్యలను విన్నవించామని, అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అర్హత లేదా, అనుభవం లేదా అని ప్రశ్నించారు. రెగ్యులర్‌ చేయమని అడిగితే.. చేస్తాం, చూస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు గడ్డి తినిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 రోజులుగా సమ్మె చేస్తున్నామని, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుకెళతామని అన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు కోటేశ్వరప్ప, జిలాన, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు రఘురామిరెడ్డి, సిరాజుద్దీన, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, ఉద్యోగులు శ్రీధర్‌ తదితరులు సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మనోహర్‌, శంకర్‌, ప్రభాకర్‌, రాము, సంధ్యా, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:14 PM