రూ.30 కోట్ల పొదుపు సొమ్ము హాంఫట్‌

ABN , First Publish Date - 2023-06-03T01:02:28+05:30 IST

డీఆర్‌డీఏలో దొంగలు పడ్డారు. మహిళా సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టారు. అక్కచెల్లెమ్మల శ్రమను దోచుకున్నారు. ఏకంగా రూ.30 కోట్లకుపైగా పొదుపు నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది

రూ.30 కోట్ల పొదుపు సొమ్ము హాంఫట్‌

- డీఆర్‌డీఏ-వైకేపీలో అవినీతి బాగోతం

- అక్కచెల్లెమ్మల శ్రమనూ దోపిడీ చేస్తున్న వైనం

- ఫిర్యాదు చేసినా పట్టించుకోని యంత్రాంగం

- తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమాలు

- లబోదిబోమంటున్న మహిళా సంఘాల సభ్యులు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 2: డీఆర్‌డీఏలో దొంగలు పడ్డారు. మహిళా సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టారు. అక్కచెల్లెమ్మల శ్రమను దోచుకున్నారు. ఏకంగా రూ.30 కోట్లకుపైగా పొదుపు నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. ఆశాఖలో తవ్వేకొద్దీ అవినీతి బాగోతం బయటపడుతోంది. పొదుపు సంఘాల మహిళలు పోగు చేసుకున్న సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన డీఆర్‌డీఏ సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. జిల్లావ్యాప్తంగా నాలుగేళ్లలో కోట్లాది రూపాయల సొమ్ము అవినీతి సిబ్బంది జేబుల్లో చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్‌, ఉన్నతి, స్త్రీనిధి రుణాలు స్వయం సహాయక మహిళా సంఘాలకు చెల్లిస్తారు. స్త్రీనిధి సొమ్మును అడ్డదిడ్డంగా కాజేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా మహిళల సొమ్ము దుర్వినియోగమైన ఘటనలు బయటపడ్డాయి. ఈక్రమంలో డీఆర్‌డీఏ-వైకేపీ యంత్రాంగం అవినీతి లోగుట్టుపై దృష్టిసారించింది.

సీఐఎఫ్‌లో రూ.20 కోట్లు స్వాహా

పొదుపు సంఘాల మహిళలు సొమ్మును పోగు చేసుకుంటారు. తిరిగి రూపాయి వడ్డీతో పొంది, జీవనోపాధుల పెంపుకోసం ఏర్పాటు చేసుకున్నదే సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్‌). జిల్లాలో సుమారు రూ.20 కోట్ల వరకు సీఐఎఫ్‌ నిధులు దుర్వినియోగమైనట్లు తెలిసింది. డీఆర్‌డీఏ-వైకేపీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి, మెక్కేశారు. సామాజిక పెట్టుబడి నిధి కింద ప్రతి సంఘంలోని మహిళా సభ్యురాలి నుంచి నెలకు రూ.10-100 వరకు వసూలు చేసి పోగుచేసుకుంటారు. ఆసొమ్మునూ వదల్లేదంటే... ఉద్యోగుల అవినీతికి హద్దుల్లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీలకు చెల్లించే ఉన్నతి పథకంలోనూ సుమారు రూ.5 కోట్ల వరకు నిధులు గోల్‌మాల్‌ అయినట్లు ఆరోపణలున్నాయి.

‘స్త్రీనిధి’ సొమ్ముకూ ఎసరు..

స్వయం సహాయక మహిళా సంఘాల జీవనోపాధుల పెంపునకు ‘స్త్రీనిధి’ మొదటి మెట్టు. ఈ పథకంలోని సొమ్మునూ దోచేసిన ఘటనలు వెలుగుచూశాయి. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలో పొదుపుసంఘాల నిధులు స్వాహా చేశారని బాధిత మహిళా సంఘాల సభ్యులు ఇటీవల ఫిర్యాదు చేశారు. సామాజిక తనిఖీలో అవినీతి బయటపడింది. పొదుపు సంఘాలు చెల్లించిన నగదు బ్యాంకులో జమచేయలేదు. యానిమేటరు, సీసీ, ఏపీఎం, ఏసీలు వాటాలు పంచుకుని నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు తనిఖీ బృందం తేల్చింది. ఏకంగా రూ.14 లక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇందులో రూ.8 లక్షల వరకు రికవరీ చేశారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోనూ డీఆర్‌డీఏ-వైకేపీ సిబ్బంది స్త్రీనిధి సొమ్ము రూ.5 కోట్ల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

విచారణ పక్కదారి?

డీఆర్‌డీఏలో అవినీతి, అక్రమాలు వెలుగుచూసిన ప్రతిసారీ విచారణ పేరుతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతారు. అసలైన అవినీతి అధికారులను తప్పించి, చిరుద్యోగులపై వేటువేస్తూ, చేతులు దులుపుకుంటున్నారు. 2019లో అప్పటి ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించిన పసుపు-కుంకుమ నిధులు దుర్వినియోగంలోనూ విచారణ తంతును మమ అనిపించారు. ఉరవకొండలో ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అప్పట్లో రూ.90 లక్షల పసుపు-కుంకుమ నిధులు అక్కచెల్లెమ్మలకు అందజేయలేదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే మెక్కేసినట్లు ఫిర్యాదు వచ్చింది. డీఆర్‌డీఏ అధికారులే ఈ ఘటనపై 2020లో విచారణ కూడా చేశారు. అయితే ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తేలలేదు. చందమామ, గంగ గ్రామైఖ్య సంఘాలకు సంబంధించి రూ.17,52,159 నిధులు దుర్వినియోగంపై సీసీలు చంద్రశేఖర్‌, మల్లే్‌షపై ఇటీవల సస్పెన్షన వేటు వేశారు. విచారణ పక్కదోవ పట్టించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులను వదిలేసి చిరుద్యోగులపై చర్యలు ఏంటని ఆశాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. కీలకంగా ఉన్న ఏసీ, ఏపీఎంలను వదిలేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ.. ఉద్యోగులపై చర్యలు

- నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ

డీఆర్‌డీఏ-వైకేపీ పరిధిలో స్వయం సహాయక మహిళా సంఘాల నిధుల ప్రతి పైసాకు లెక్క ఉంటుంది. ఎక్కడైనా సొమ్ములో తేడా వస్తే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. విచారణ చేపట్టి, సొమ్మును రికవరీ చేస్తాం. బాధ్యులైన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. పోలీసు కేసులు నమోదు చేయిస్తాం.

Updated Date - 2023-06-03T01:02:28+05:30 IST