Share News

పచ్చి అబద్ధాలు..!

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:35 AM

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు, ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒట్టి మాటలు తప్ప ఎక్కడా వాస్తవాలు మాట్లాడలేదు. జగన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశామని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న విషయాన్ని దాచారు.

పచ్చి అబద్ధాలు..!
ఖాళీగా దర్శనమిస్తున్న సాధికార యాత్ర సభ

సాధికార సభలో ఒట్టి మాటలు

హామీల అమలు మరిచిపోయారా..?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం

మభ్యపెట్టేందుకే సాధికార బస్సుయాత్ర

మంత్రులు, వైసీపీ నాయకులపై విపక్షాల మండిపాటు

అనంతపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు, ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒట్టి మాటలు తప్ప ఎక్కడా వాస్తవాలు మాట్లాడలేదు. జగన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశామని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న విషయాన్ని దాచారు. బటన నొక్కుడు భజన తప్ప.. కరువు జిల్లా అభివృద్ధికి బాటలు వేయలేదన్న నిజాన్ని చెప్పలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మభ్యపెట్టేలా అనంతపురం నగరంలో శుక్రవారం సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. విపక్షాలు సైతం ఇదే విమర్శ చేశాయి. రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన జిల్లాకు వచ్చిన పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్న విషయాన్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మరిచిపోయారని విపక్షాలు మండిపడ్డాయి.

ఏం చేశావ్‌ మనవడా..?

జిల్లా మనవడినని, ఈ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జగన అనేక సందర్భాల్లో అన్నారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఎక్కడ అమలు చేశారో చెప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీ నాయకులది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ హామీని గాలికొదిలేశారు. పేరూరు, భైరవానతిప్ప ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతామని శంకుస్థాపన చేశారు. పెనుకొండలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపడుతామని శంకుస్థాపన చేశారు. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కరువు జిల్లా అనంతకు వందలాది హామీలు ఇచ్చారు. ఇందులో వేటిని నెరవేర్చారో సాధికార సభకు హాజరైన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పగలరా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

అప్పట్లో ఎన్నో పథకాలు..

‘గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసింది వాస్తవం కాదా...? ఆ వర్గాల కోసం ప్రత్యేక పథకాల ద్వారా ఆర్థికచేయూతనిచ్చింది నిజం కాదా..? రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన ఇచ్చింది వాస్తవం కాదా...? కియ పరిశ్రమను తీసుకొచ్చి.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించలేదా..? మరీ ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం దుల్హాన పథకం అమలు చేయలేదా..?’ అని విపక్షం ప్రశ్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మాటలతో మభ్యపెట్టేందుకే సాధికారిక సభలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేసి, ఆ వర్గాలకు తీరని అన్యాయం చేశారని విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి ఎక్కడ..?

అనంతపురం నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీనికి ఏం బదులిస్తారని ఓట్లేసిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బటన నొక్కుడుతో నవరత్నాల రూపంలో ఏడాదికి పది వేలో... పదిహేనువేలో లబ్ధిదారుల అకౌంట్లలో జమచేస్తే జిల్లా అభివృద్ధి చెందినట్లా అని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత తమదేనని చెప్పుకునే వైసీపీ ప్రజాప్రతినిధులు.. ఆ వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఒక్కపైసా నిధులిచ్చి ఆదుకున్నారా అని నిలదీస్తున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు ఉత్సవ విగ్రహాలు కాదా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిందే జగన అంటున్నారు. జిల్లాలో ఈ వర్గాలవారు ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో తెలుసా..?’ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - Dec 30 , 2023 | 01:35 AM