నమ్మించి.. చోరీలు

ABN , First Publish Date - 2023-06-01T00:42:38+05:30 IST

ఒంటరి మహిళలను మాయమాటలతో నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అనంతపురం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నమ్మించి.. చోరీలు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, ముసుగులో నిందితుడు చంద్ర

ఒంటరి మహిళలే అతని టార్గెట్‌

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ

రూ.6.40 లక్షల బంగారు నగలు స్వాధీనం

అనంతపురం క్రైం, మే 31: ఒంటరి మహిళలను మాయమాటలతో నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అనంతపురం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నెల్లూరు జిల్లా కోట మండలం శ్యామచంద్రాపురం గ్రామానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్‌ చంద్రబాబు. ఇతన్నుంచి రూ.6.40 లక్షల విలువైన 124.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. రూరల్‌ పోలీ్‌సస్టేషన్లో సీఐ విజయభాస్కర్‌గౌడ్‌తో కలిసి రూరల్‌ డీఎస్పీ వెంకటశివారెడ్డి బుధవారం ఈ కేసు వివరాలను విలేకరులకు వివరించారు.

చేవూరి చంద్ర 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. దురలవాట్లకు బానిసయ్యాడు. తనకు తెలిసిన వంట పనితో వచ్చే డబ్బుసరిపోక, సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని భావించాడు. ఒంటరి మహిళలను బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కలిసి తన మాటకారితనంతో ఆకట్టుకునేవాడు. పూజలు చేస్తానని, అనారోగ్యానికి మందులిస్తానని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారినని నమ్మబలికేవాడు. అలా వారి ఫోన నెంబర్లు, అడ్ర్‌సలు తీసుకుని ఇళ్లకు వెళ్లేవారు. నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ తీసుకెళ్లి, ఆరోగ్యానికి మంచిదని నమ్మించి, వారిచేత తాగించేవాడు. మహిళలు స్పృహ కోల్పోయాక ఆభరణాలను ఎత్తుకుపోయేవాడు. గత నెలలో అనంతపురానికి చెందిన ఓ మహిళను కదిరి బస్టాండ్‌లో పరిచయం చేసుకుని ఇలాగే మోసగించాడు. తాడిపత్రి, ముషీరాబాద్‌లో దొంగతనాలు చేశాడు. నంద్యాల, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలలో ఇతనిపై దాదాపు 20 కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో జైలుకువెళ్లి బయటకు వచ్చాక, అనంతపురం, తాడిపత్రి, ముషీరాబాద్‌లో చోరీలు చేశాడు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారు. అంతర్రాష్ట దొంగను అరెస్టు చేసిన రూరల్‌ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఎస్‌ఐ నబీరసూల్‌, కానిస్టేబుళ్లు శివన్న, జయరాం, పాండవను అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు అభినందించారు.

Updated Date - 2023-06-01T00:42:38+05:30 IST