పంతం నెగ్గించుకున్న పద్మావతి
ABN , First Publish Date - 2023-06-03T00:57:18+05:30 IST
ఎట్టకేలకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు పంతం నెగ్గించుకున్నారు. పట్టుబట్టి తాడిపత్రి పోలీసు సబ్‌డివిజన నుంచి పుట్లూరు, యల్లనూరు మండలాలను అనంతపురం రూరల్ పోలీసు సబ్‌డివిజనకు మార్పించుకున్నారు.

రూరల్ సబ్‌డివిజనలోకి పుట్లూరు, యల్లనూరు పోలీ్‌సస్టేషన్లు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం
తాడిపత్రి, జూన 2: ఎట్టకేలకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు పంతం నెగ్గించుకున్నారు. పట్టుబట్టి తాడిపత్రి పోలీసు సబ్‌డివిజన నుంచి పుట్లూరు, యల్లనూరు మండలాలను అనంతపురం రూరల్ పోలీసు సబ్‌డివిజనకు మార్పించుకున్నారు. రెండురోజుల క్రితం సబ్‌డివిజన మార్పుపై ప్రభుత్వం నుంచి ఎస్పీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. పుట్లూరు, యల్లనూరు మండలాలు శింగనమల నియోజకవర్గంలో ఉన్నా తాడిపత్రి సబ్‌డివిజన పరిధిలో ఉన్నాయి. సబ్‌డివిజన కేంద్రం తాడిపత్రి కావడంతో ఇక్కడి ఎమ్మెల్యే పెద్దారెడ్డి రెండు మండలాలపై పోలీసు అధికారుల ద్వారా పట్టుసాధించే ప్రయత్నం చేశారు. ఇది శింగనమల ఎమ్మెల్యేకు మింగుడుపడలేదు. యల్లనూరు పెద్దారెడ్డి సొంత మండలం కావడంతో తనవర్గాన్ని కాపాడుకొనేందుకు పోలీసుల సాయంతో శింగనమల ఎమ్మెల్యే వర్గంపై కేసులు పెట్టించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులపై శింగనమల ఎమ్మెల్యే వద్ద పలుమార్లు అనుచరులు వాపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో తాడిపత్రి సబ్ డివిజన నుంచి పుట్లూరు, యల్లనూరు మండలాలను అనంతపురం సబ్‌డివిజనకు మార్చితే తప్ప ప్రయోజనం ఉండదని నాయకులు ఎమ్మెల్యే వద్ద గట్టిగా చెప్పినట్లు సమాచారం. 2024లో జరిగే ఎన్నికల్లో పెద్దారెడ్డి అధిపత్యం కారణంగా తమ ఓట్లకు కూడా గండిపడే అవకాశం ఉంటుందన్న ఆలోచనను కూడా శింగనమల ఎమ్మెల్యే ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ నిశితంగా చర్చించి పార్టీ, ప్రభుత్వ పెద్దల వద్ద పావులు కదిపి ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు ఆరెండు మండలాలను అనంతపురం రూరల్ సబ్‌డివిజనలోకి విలీనం చేయించి పంతం నెగ్గించుకున్నారు. దీంతో పెద్దారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టే యత్నం జరిగినట్లైంది.
రాజకీయ ఆధిపత్యం కోసమే!
అనంతపురం రూరల్ సబ్‌డివిజన యల్లనూరుకు 95, పుట్లూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా రాజకీయ ఆధిపత్యం కోసమే విలీనం చేశారనే విమర్శలు వినిపిస్తున్నా యి. మండల కేంద్రాలకు రావాలంటే డీఎస్పీకి గంటన్నర నుంచి 2గంటల సమయం పడుతుంది. సబ్‌డివిజనకు వివిధ సమస్యల నిమిత్తం ప్రజలు వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్వాల్సి ఉంటుంది. తాడిపత్రి సబ్‌డివిజన యల్లనూరుకు 25, పుట్లూరుకు 12కిలోమీటర్ల దూరంలో ఉం డేది. రెండు మండలాల వారు గంటలోపే తాడిపత్రికి వచ్చేవారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ప్రారంభం కా నుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు మండలాలను సుదూరంగా ఉన్న అనంతపురం రూరల్ సబ్‌డివిజనలోకి విలీనం చేయడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
1996లో తాడిపత్రి పోలీసు సబ్‌డివిజన ఏర్పాటు
తాడిపత్రి సబ్‌డివిజనను 1996 లో ఏర్పాటు చేశారు. ధర్మవరం సబ్‌డివిజన పరిధిలో ఉన్న తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రిటౌన, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి రూరల్, గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, పామిడి మండలాలు, శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు మండలాలను కలుపుకొని 9మండలాలతో తాడిపత్రి పట్టణ కేంద్రంగా సబ్‌డివిజన కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. గతేడాది తాడిపత్రి సబ్‌డివిజనలో ఉన్న గుత్తి, పామిడి మండలాలను గుంతకల్లు సబ్‌డివిజనలోకి, ప్రస్తుతం పుట్లూరు, యల్లనూరు మండలాలను అనంతపురం రూరల్ సబ్‌డివిజనలోకి మార్చారు. దీంతో సబ్‌డివిజనకు 7మండలాలు ఉండగా ఈ రెండింటి విలీనంతో 9కి చేరింది. ప్రస్తుతం తాడిపత్రి పోలీసు సబ్‌డివిజన తాడిపత్రి నియోజకవర్గంలోని మండలాలకే పరిమితమైంది.