పాదయాత్ర.. ఓ చరిత్ర
ABN , First Publish Date - 2023-07-12T00:42:59+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు పేర్కొన్నారు.
లోకేశ యువగళం.. 2000 కి.మీ.
జిల్లా వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు
అనంతపురం, జూలై 11(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు పేర్కొన్నారు. నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 2 వేలు కిలో మీటర్ల మైలురాయిని మంగళవారం దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇనచార్జిలు, పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో యువగళానికి సంఘీభావ యాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- అనంతపురం అర్బనలో నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి రాంనగర్‌లోని ఆ పార్టీ అర్బన కార్యాలయం నుంచి కోర్టు రోడ్డు, క్లాక్ టవర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేశారు. ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాదయాత్రలో లోకేశ జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
- లోకేశ యువగళం పాదయాత్ర 2వేల మైలురాయి దాటడంద్వారా చరిత్రను సృష్టించారని ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో యువగళం పాదయాత్ర నవచైతన్యాన్ని నింపిందని అన్నారు. పాదయాత్ర పూర్తైతే వైసీపీకి రాష్ట్రంలో నూకలు చెల్లినట్లేనని ఆయన జోష్యం చెప్పారు.
- కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర నుంచి వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్రలో లోకేశ అలుపెరుగకుండా సాగిపోవాలని, పాదయాత్ర లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని ఉమా తెలిపారు. పాదయాత్రలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యులయ్యారు.
- మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు బ్రహ్మసముద్రం మండలంలోని బైరిసముద్రంలో పాదయాత్ర చేపట్టారు. లోకేశ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.
- గుంతకల్లు నియోజకవర్గంలో ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు పాత గుంతకల్లు నుంచి ఎన్టీఆర్ విగ్రహం దాకా పాదయాత్ర చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. లోకేశ పాదయాత్రతో వైసీపీలో దడ పుడుతోందని అన్నారు.
- శింగనమల నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ నాగలింగారెడ్డి, డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. వెస్ట్ నరసాపురం నుంచి గురుగుంట్ల వరకు భారీ పాదయాత్ర చేపట్టారు.
- రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ పట్టణ ఆధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు వినాయక సర్కిల్ నుంచి శాంతి నగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు.
- రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్లు, మాజీ జడ్పీటీసీలు రామ్మూర్తి నాయుడు, వేణుగోపాల్, తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అనంతపురం నగర శివారులోని కళ్యాణదుర్గం రోడ్డు నరిగెమ్మ అమ్మవారి ఆలయం నుంచి కక్కలపల్లి, నందమూరి నగర్ దాకా కొనసాగింది. పాదయాత్రలో వందలాది మంది పార్టీ శ్రేణులు భాగస్వాములయ్యారు. పాదయాత్ర పొడవునా పార్టీ శ్రేణుల జయజయ ధ్వానాలు మిన్నంటాయి.