మంటల్లో చిక్కుకుని వంద గొర్రెపిల్లలు మృతి

ABN , First Publish Date - 2023-02-24T23:54:48+05:30 IST

గొర్రె పిల్లలను ఉలవ పంటను మేత మేపడానికి తీసుకుని వెళ్దామనుకున్న సమయంలోనే ప్రమాదవశాత్తు 100 గొర్రె పిల్లలు మంటల్లో కాలిపోయాయి.

మంటల్లో చిక్కుకుని వంద గొర్రెపిల్లలు మృతి

కంబదూరు, ఫిబ్రవరి 24: గొర్రె పిల్లలను ఉలవ పంటను మేత మేపడానికి తీసుకుని వెళ్దామనుకున్న సమయంలోనే ప్రమాదవశాత్తు 100 గొర్రె పిల్లలు మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని వైసీపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వైసీపల్లికి చెందిన బడెప్ప, రాము, రంగారెడ్డి, పేరూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప నెల రోజుల నుంచి వైసీపీల్లి- దేవేంద్రపురం తండాలో ఉన్న పొలాల మధ్యలో 700 గొర్రెలతో అక్కడే దొడ్డి వేసుకుని ఉన్నారు. వాటి ద్వారానే జీవనాఽధారంగా బతుకుతూ జీవిస్తున్నారు. చుట్టూ పక్కల పొలాల్లో మేతకు వెళ్లి తిరిగి రాత్రి సమయాల్లోనే అక్కడే గొర్రెల దొడ్డిలోనే గొర్రెల వేసుకుని ఉంటున్నారు. అయితే 700 గొర్రెలకు పుట్టిన 100 గొర్రె పిల్లల కోసం మరో దొడ్డిని ఏర్పాటుచేసుకుని, వాటికి రక్షణగా కంచెను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రతి రోజులాగానే శుక్రవారం కూడా మేత కోసం పెద్ద గొర్రెలను సమీప తోటల్లోకి తీసుకెళ్లారు. అయితే ప్రతిరోజు మధ్యా హ్నం చిన్న గొర్రె పిల్లలను ఉలవ పంటను మేపడానికి తీసుకెళ్లేవారు. అంతలోనే ఈ గొర్రెలదొడ్డికి సమీపంలోనే సుమారు 200 అడుగుల దూరంలో బీడుభూముల్లో ఉన్న ఎండుగడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. విపరీతమైన గాలి ఉంటూ, ఆ గాలికి మంటలు ఆ గొర్రెల దొడ్డి వరకు వ్యాపించాయి. ఒక్కసారిగా ఆ ఇసుప కంచెతో రక్షణగా ఏర్పాటు చేసుకుని ఉన్న వంద గొర్రె పిల్లలకు ఉన్న దొడ్డికి మంటలు పాకి గొర్రెపిల్లలు మంటల్లో కాలి మృతిచెందాయి. సుమారు రూ. 5 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని రెవెన్యూ అధికారులు, పశువైద్యాధికారులు పరి శీలించి, నష్ట పరిహారం అందించే విధంగా చూస్తామని ఆ గొర్రెల కాపర్లకు అధికారులు హామీనిచ్చారు.

Updated Date - 2023-02-24T23:54:50+05:30 IST