గృహ ప్రవేశాలు మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2023-01-15T00:28:09+05:30 IST

సంక్రాంతికి సొంతింటిలో చేరాలని భావించిన పేదలకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఇప్పటికే పలు దఫాలు వాయిదా పడిన గృహ ప్రవేశం.. మరోమారు వాయిదా పడింది. మొదట గత ఏడాది డిసెంబరు అన్నారు. ఆ తర్వాత సంక్రాంతికి ఉండొచ్చన్నారు. ఇప్పుడు ఉగాది అంటున్నారని తెలిసింది.

గృహ ప్రవేశాలు మళ్లీ వాయిదా
ఆలమూరు లేఔట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు

గృహ ప్రవేశాలు మళ్లీ వాయిదా

నత్త నడకన జగనన్న ఇళ్ల నిర్మాణం

ఆలమూరులో కట్టింది 570 ఇళ్లే.. లక్ష్యం 2000...

ప్రారంభం కానివి 1200

సంక్రాంతికి సొంతింటిలో చేరాలని భావించిన పేదలకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఇప్పటికే పలు దఫాలు వాయిదా పడిన గృహ ప్రవేశం.. మరోమారు వాయిదా పడింది. మొదట గత ఏడాది డిసెంబరు అన్నారు. ఆ తర్వాత సంక్రాంతికి ఉండొచ్చన్నారు. ఇప్పుడు ఉగాది అంటున్నారని తెలిసింది. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అందుకే లబ్ధిదారుల కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి. అధికార లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 14 వేల ఇళ్లను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ఒక్క ఆలమూరు లే ఔట్‌లోనే రెండు వేల ఇళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. అందుకే వాయిదా వేయాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు.

- అనంతపురం సిటీ

లక్ష్యం.. రెండు వేల ఇళ్లు

నగర శివారులోని ఆలమూరు లే ఔట్‌లో 5,315 మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. అప్షన -2 కింద ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించింది. వీటిలో 20 ఇళ్లను లబ్ధిదారులే కట్టుకుంటున్నారు. మిగిలిన వారికి ప్రభుత్వమే కట్టిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఇప్పటి వరకూ కేవలం 570 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. 1200 ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఉగాది పండుగకు రెండు వేల మంది చేత గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఉగాదికైనా అవుతుందా..?

ఆలమూరు లే ఔట్‌లో ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు, డ్వాక్రా రుణం రూ.35 వేలు వినియోగిస్తోంది. అయినా ఇంకా 12 వందల ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీంతో తమకు ఇళ్లను నిర్మించి ఇస్తారా లేదా అన్న సందేహం లబ్ధిదారుల్లో నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లే ఔట్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన 257 లే ఔట్‌లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో నాలుగు లే ఔట్‌లను జాబితా నుంచి తొలగించారని విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడి లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉగాదినాటికైనా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి.

నాణ్యత అంతంతే...

ఆలమూరు లే ఔట్‌లో ఇళ్ల నిర్మాణం నాణ్యతపై పలు విమర్శలు వస్తున్నాయి. మౌళిక వసతులు, నాణ్యత గురించి కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారుకు డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.35 వేలు రుణం మంజూరు చేసి, కాంట్రాక్టర్‌కు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారు సొంతంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని, ఆప్షన-3 కింది అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లు సమాచారం.

వేగవంతం చేస్తాం..

గృహ ప్రవేశాలు పలుమార్లు వాయుదా పడిన విషయం వాస్తవమే. సంక్రాంతి తర్వాత ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచుతాం. ఉగాదికి లక్ష్యం పూర్తి చేసి ఇళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం డ్వాక్రా రుణాలు మంజూరు చేసి ఏజెన్సీకి అందజేస్తున్నాం. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోనే లబ్ధిదారులకు భారంగా మారింది.

- క్రిష్ణారావు, జిల్లా గృహ నిర్మాణశాఖ ఈఈ

Updated Date - 2023-01-15T10:25:22+05:30 IST