Share News

నల్లి బెడద

ABN , First Publish Date - 2023-12-11T00:50:53+05:30 IST

బ్యాడిగ మిరప వైపు దృష్టి సారించిన మండలంలోని అన్నదాతలకు కొత్తగా నల్లి బెడద ఎదురైంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న మిరపకు మొదట వైరస్‌ దాపురించగా, ప్రస్తుతం నల్లి పురుగు ఆశించింది. ఎన్ని మందులు పిచికారి చేసినా అది నివారణకాక పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

నల్లి బెడద
ఆరబోసిన బ్యాడిగ మిరపకాయలు

వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న మిరప పంట

వాతావరణ మార్పులతో పంట నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న అన్నదాతలు

కూడేరు, డిసెంబరు 10: బ్యాడిగ మిరప వైపు దృష్టి సారించిన మండలంలోని అన్నదాతలకు కొత్తగా నల్లి బెడద ఎదురైంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న మిరపకు మొదట వైరస్‌ దాపురించగా, ప్రస్తుతం నల్లి పురుగు ఆశించింది. ఎన్ని మందులు పిచికారి చేసినా అది నివారణకాక పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఎకరాల్లో బ్యాడిగ మిరప సాగు చేస్తున్నారు. ఇందులో ముద్దలాపురం గ్రామంలోనే ఎక్కువభాగం పంట సాగవుతోంది. మొక్కనాటినప్పటి నుంచి ఎటువంటి వైరస్‌ రాకుండా కంటికి రెప్పలా కాపాడినా నల్లిపురుగు దెబ్బకు పైరు మొత్తం ఎర్రగా మారి మొక్క ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వైరస్‌ నివారణ కాకపోవడంతో కొందరు రైతులు పంటను గొర్రెల మేతకు వదిలేశారు. ఒక్కొక్క రైతు రెండు ఎకరాల నుండి పది ఎకరాల వరకు పంట సాగు చేశారు. ఎకరాకు లక్ష రూపాయిలకు పైగా పెట్టుబడి పెట్టారు. అయినా దిగుబడి లేకపోవడంతో అప్పులపాలైనట్లు రైతులు వాపోయారు. నెల రోజుల క్రితం కోసిన కాయలు వాతావరణంలో మార్పులు రావడంతో కలర్‌ మారుతున్నాయని, దీంతో వాటికి మార్కెట్‌లో ధర తగ్గిపోతోందన్నారు.

లక్షల్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యాం!

9 ఎకరాల్లో మిరప పంట సాగు చేశా. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా నల్లి పురుగు దెబ్బకు పంట పూర్తిగా ఎర్రగా మారిపోయింది. పంటకు దాదాపు తొమ్మిది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా, రూ. రెండు లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కూలీల కోసం ఇతర గ్రామాలకు పరుగులు తీసి అష్టకష్టాలు పడినా చివరకు అప్పుల పాలయ్యాం.

- రైతు నీలకంఠారెడ్డి, ముద్దలాపురం, కూడేరు మండలం

గొర్రెల మేతకు వదిలాం..

మిరప పంటకు వైరస్‌ ఎక్కువ కావడంతో పంటను గొర్రెలకు మేతకు వదిలేశాం. నేను ఐదు ఎకరాల్లో మిరప సాగు చేసి దాదాపు నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పంట ఏపుగా పెరగడంతో దిగుబడి ఆశాజనంగా వస్తుందన్న ఆశతో ఉండగా, వైరస్‌ మహమ్మరి పంటను నాశనం చేసింది. ఎన్ని మందులు కొట్టినా నివారణ కాకపోవడంతో చివరికి వదిలిపెట్టాం. పంట సాగుకు నాలుగు లక్షలు అప్పులు అయ్యాయి. ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.

- రైతు లక్ష్మీనారాయణ, ముద్దలాపురం, కూడేరు మండలం

ప్రభుత్వమే ఆదుకోవాలి..

ఆరు ఎకరాల్లో మిరప పంట సాగు చేయగా, నెలరోజుల క్రితం వచ్చిన చిన్నపాటి వర్షానికి కాయలపై నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మందులు కొట్టినా మచ్చపోలేదు. కాయలను కోయడానికి కూలీలు దొరక్క నానా అవస్థలు పడుతున్నాం. పంట పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- రైతు సురేష్‌, ముద్దలాపురం, కూడేరు మండలం

Updated Date - 2023-12-11T00:50:54+05:30 IST