పంచాయతీ వాటర్‌మన్‌ హత్య

ABN , First Publish Date - 2023-08-02T12:15:21+05:30 IST

రోజూ తాగడం, భార్యతో గొడవ పడటం, ఆమెను కొట్టడం అతనికి ఇదే పని. బట్టల్లేకుండా తిరుగుతూ మరీ పైశాచికంగా తయారయ్యాడు. దీంతో విరక్తి చెందిన భార్య, బావమరిది అతడిని హతమార్చారు....

పంచాయతీ వాటర్‌మన్‌ హత్య

భార్య, బావమరదులే హంతకులు

తాగుడు, దెబ్బలు భరించలేకే ఘాతుకం

అనంతపురం క్రైం: రోజూ తాగడం, భార్యతో గొడవ పడటం, ఆమెను కొట్టడం అతనికి ఇదే పని. బట్టల్లేకుండా తిరుగుతూ మరీ పైశాచికంగా తయారయ్యాడు. దీంతో విరక్తి చెందిన భార్య, బావమరిది అతడిని హతమార్చారు. ఇటుకలపల్లి సీఐ నరేంద్రరెడ్డి కథనం మేరకు, మునీంద్ర(30) సొంతూరు ముదిగుబ్బ. పన్నెండేళ్ల క్రితం ఆకుతోటపల్లికి వచ్చి, భార్య నల్లమ్మతో కలిసి ఉంటున్నాడు. పంచాయతీ వాటర్‌మన్‌గా కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. క్రమంగా మద్యానికి బానిసగా మారిన మునీంద్ర, రోజూ ఇంటి కొచ్చి భార్యతో గొడవపడి, ఆమెను కొట్టేవాడు. ఆ బాధను తన సోదరుడు ముంటిమడుగు నరే్‌షతో నల్లమ్మ పంచుకుని బాధపడేది. ఎంత చెప్పినా మునీంద్రలో మార్పు కనిపించకపోగా మరింతగా రెచ్చిపోయేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సైతం అదే రీతిలో ప్రవర్తించాడు. భర్తదెబ్బలకు తట్టుకోలేని ఆమె ఆ విషయాన్ని తన సోదరునితో చెప్పింది. ఆ తరువాత వారిద్దరూ కలిసి అతన్ని ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నరేష్‌, అతని బావమరిది హరి, ఇద్దరు స్నేహితులు కలిసి మునీంద్రతో మద్యం తాగడానికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న మునీంద్రపై దాడి చేసి హతమార్చారు. అనంతరం అతని శవాన్ని మన్నీలకు పోయే దారిలో హెచ్చెల్సీ పక్కన పడేశారు. ఇటుకలపల్లి పోలీసులకు దీనిపై మంగళవారం ఉదయం సమాచారం అందింది. పోలీసుల విచారణలో మృతుని భార్య నల్లమ్మ, ఆమె సోదరుడు నరేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-02T12:15:21+05:30 IST