‘సరోజమ్మది ప్రభుత్వం చేసిన హత్య’
ABN , First Publish Date - 2023-12-11T00:11:26+05:30 IST
గిరిజన యువతి సరోజమ్మ పింఛనును తొలగించి ఆమె ఆత్యహత్యకు ప్రభుత్వం కారణమైందని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు పేర్కొన్నారు.
గుంతకల్లు, డిసెంబరు10: గిరిజన యువతి సరోజమ్మ పింఛనును తొలగించి ఆమె ఆత్యహత్యకు ప్రభుత్వం కారణమైందని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు పేర్కొన్నారు. తమ్ముడికి ఉద్యోగం వచ్చిందంటూ అంధురాలైన సరోజమ్మ పింఛనును తొలగించడంతో ఆమె శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనపై ఆదివారం ఉదయం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు వెళ్లిన జితేంద్రగౌడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. అర్థరహితమైన నిబంధనలతో ఏమాత్రం కళ్లు కనిపించని ఓ అభాగ్యురాలి పింఛన్ను తొలగించాలన్న ఆలోచన అత్యంత దారుణమైనదన్నారు. ఈ సంఘటనపై మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఎంతో మనస్తాపం చెందారని, ట్విట్టర్‌లో ఆవేదనను వెలిబుచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీ కేశప్ప, కురుబ చంద్రశేఖర్, బీ రాము, జగన్నాథ్, బుసి, తదితరులు పాల్గొన్నారు.