వ్యాపారి ఐపీ..!
ABN , First Publish Date - 2023-12-01T00:38:29+05:30 IST
అప్పుచేసి పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా ఆగి, అమ్ముకోవాలని భావించి.. దిగుబడిని ఓ వ్యాపారికి అప్పగించారు. అతనేమో డబ్బులు ఇప్పుడే చెల్లించలేనని రైతులకు ఐపీ నోటీసులు పంపించారు.
రైతులకు రూ.20 కోట్లు బకాయి
అనామత్తు వ్యాపారం.. అన్నదాతకు నష్టం
పప్పు శనగ, ధనియాల డబ్బు అంతేనా..?
బెళుగుప్ప, నవంబరు 30: అప్పుచేసి పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా ఆగి, అమ్ముకోవాలని భావించి.. దిగుబడిని ఓ వ్యాపారికి అప్పగించారు. అతనేమో డబ్బులు ఇప్పుడే చెల్లించలేనని రైతులకు ఐపీ నోటీసులు పంపించారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. బెళుగుప్ప మండల రైతులు స్థానిక వ్యాపారి వద్ద పప్పు శనగ, ధనియాల దిగుబడులను నిల్వ చేశారు. గిట్టుబాటు ధర వచ్చాక.. వాటిని అమ్మి.. రైతులకు వ్యాపారి డబ్బులను చెల్లించాల్సి ఉంది. ఈ పద్ధతి కొన్నేళ్లుగా సాగుతోంది. వ్యాపారులపై నమ్మకంతో లక్షలాది రూపాయల పంటను రైతులు అప్పగిస్తుంటారు. ఒకోసారి గిట్టుబాటు ధర కోసం రెండు మూడేళ్లు సరుకును వ్యాపారి వద్దనే ఉంచుతారు. అనామత్తుగా జరిగే ఈ వ్యాపారం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్ల క్రితం తగ్గుపర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.2 కోట్లకు పైగా రైతులకు చెల్లించలేదు. తాజాగా బెళుగుప్పకు చెందిన ఓ వ్యాపారి సుమారు రూ.20 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేనని చేతులెత్తేశాడు. డి వెంకటనాయుడికి రూ.7 లక్షలు, కోదండపాణికి రూ.2 లక్షలు, రామాంజినేయులుకు రూ.5 లక్షలు.. మొత్తం 41 మంది రైతులకు ఇప్పుడే డబ్బు ఇవ్వాలేనని నోటీసులు పంపాడు. కొవిడ్ సమయంలో వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నోటీసులో పేర్కొన్నాడు. మూడేళ్ల క్రితం నాటి కొవిడ్‌ను సాకుగా చూపించి తమను మోసగించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో పంటను అప్పగిస్తే.. వ్యాపారులు ఇలా ఐపీ పేరిట మోసపుచ్చితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఐపీ నోటీసు ఇచ్చారు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వ్యాపారిపైన నమ్మకంతో అప్పగిస్తే.. డబ్బులు ఇవ్వకుండా తాత్కాలిక ఐపీ నోటీసులు పంపారు. ఈ ఏడాది పంట పోయింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఐపీ నోటీసులు పంపించారు. బళ్లారి కోర్టుకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఇదేం ఖర్మనో అర్థం కావడం లేదు.
- శ్రీనివాసులు, రైతు ఎర్రగుడి
115 క్వింటాళ్ల పప్పుశనగ..
కష్టపడి పండించిన పప్పు శనగ 115 క్వింటాళ్లు వ్యాపారికి ఇచ్చాను. ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. బళ్లారిలో ఉంటున్నారు. డబ్బు అడిగితే ప్రామిసరీ నోటు రాసిచ్చారు. డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు, తాత్కాలిక నోటీసులు ఇచ్చుకుంటూ పోతే మా కష్టాలు తీరేదెన్నడు..? ఇలాంటి మోసాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-ప్రసాద్, రైతు, వెంకటాద్రిపలి