60 వేల ఎకరాల్లో పప్పుశనగ నష్టం
ABN , First Publish Date - 2023-12-01T00:28:13+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 60 వేల ఎకరాలలో పప్పుశనగ పంట దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మాల్యం గ్రామం వద్ద ఎండిపోయిన పప్పుశనగను గురువారం ఆయన పరిశీలించారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
కణేకల్లు, నవంబరు 30: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 60 వేల ఎకరాలలో పప్పుశనగ పంట దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మాల్యం గ్రామం వద్ద ఎండిపోయిన పప్పుశనగను గురువారం ఆయన పరిశీలించారు. కణేకల్లు మండలంలోనే దాదాపు 14 వేల ఎకరాలలో రైతులు పప్పుశనగ సాగుచేశారని, వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. పప్పుశనగ సాగుకు ఒక్కో రైతు ఎకరాకు రూ.12 వేల మేర పెట్టుబడులు పెట్టారని, వారికి ఒక్క రూపాయి కూడా తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పప్పుశనగ ఈ క్రాప్ బుకింగ్‌లో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకు ఒక్క రైతుకూ ఈ క్రాప్ బుకింగ్ చేయలేదని మండిపడ్డారు. ఖరీఫ్ సీజనలో రైతులు వేరుశనగ పంటను పూర్తిగా కోల్పోయారని, రబీలో పప్పుశనగ రైతులకూ ఇదే పరిస్థితి దాపురించిందని అన్నారు. పప్పుశనగ న ష్టాన్ని అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారీ క్షేత్రస్థాయిలో పర్యటించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యే రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పప్పుశనగ రైతుకు ఇన్సూరెన్స ద్వారా న్యాయం జరిగిందని మాల్యం గ్రామానికి చెందిన శివరాజు అనే రైతు కాలవ శ్రీనివాసులుతో అన్నారు. తనకు టీడీపీ హయాంలో రూ.2.50 లక్షల పరిహారం వచ్చిందని, వైసీపీ హయాంలో ఇప్పటి వరకు పప్పుశనగకు నష్టపరిహారం అందలేదని వాపోయాడు.