హత్య కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష

ABN , First Publish Date - 2023-01-24T23:58:43+05:30 IST

బడన్నపల్లి స్టోర్‌ డీలర్‌ చెన్నారెడ్డి హత్య కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది.

హత్య కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష

పాత కక్షలతో స్టోర్‌ డీలర్‌ చెన్నారెడ్డి హత్య

అనంతపురం క్రైం, జనవరి 24: బడన్నపల్లి స్టోర్‌ డీలర్‌ చెన్నారెడ్డి హత్య కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. ధర్మవరం మండలం బడన్నపల్లికి చెందిన ఎర్రగుంట చెన్నారెడ్డిని 2017 డిసెంబరు 6న ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ కేసులో ముద్దాయిలు కపాడం గంగాధర్‌, కపాడం సూర్యనారాయణ, దాసరి పెద్దన్న, దాసరి శివయ్య, దాసరి గంగాప్రసాద్‌, కపాడం నాగరాజుకు (ఏ1 నుంచి ఏ6) జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధిస్తూ జిల్లా, సెషన్స జడ్జి జి.శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. బడన్నపల్లికి చెందిన ఎర్రగుంట చెన్నారెడ్డి, అదే గ్రామానికి చెందిన కపాడం సూర్యనారాయణ కుటుంబాల మధ్య కక్షలు ఉన్నాయి. సూర్యనారాయణ తండ్రి నాగన్నను 30 ఏళ్ల క్రితం హత్య చేశారు. చెన్నారెడ్డి ముద్దాయిగా ఉన్న ఈ కేసును గతంలో కోర్టు కొట్టివేసింది. తన తండ్రిని చంపిన చెన్నారెడ్డిపై కక్ష తీర్చుకోవాలని సూర్యనారాయణ తన కుమారులు గంగాధర్‌, నాగరాజుకు చెప్పేవాడు. ఈ క్రమంలో 2017 నవంబరు 29న బడన్నపల్లి రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఆ కార్యక్రమంలో చెన్నారెడ్డితో సూర్యనారాయణ, అతని కుమారులు, బావ పెద్దన్న, అతని కుమారులు శివయ్య, గంగాప్రసాద్‌ వాగ్వాదానికి దిగారు. చంపేస్తామని హెచ్చరించారు. ఈ గొడవ అనంతరం.. ‘చెన్నారెడ్డిని మనం చంపకపోతే అతను గంగాధర్‌ను చంపుతాడు’ అని అందరూ మాట్లాడుకున్నారు. అలా చెన్నారెడ్డి హత్యకు ప్రణాళిక రచించారు. 2017 డిసెంబరు 6వ తేదీ ఉదయం 9గంటల సమయంలో చెన్నారెడ్డి తన మోపెడ్‌లో యూరియా బ్యాగువేసుకుని పొలానికి వెళుతుండగా, ఆరుగురు ముద్దాయిలు రెండు బైకుల్లో వెంబడించారు. చెన్నారెడ్డిని అతని తోట వద్ద అటకాయించి, కొడవళ్లతో నరికారు. ఆ సమయంలో తోటలో పనిచేస్తున్న చెన్నారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, అక్క శాంతమ్మ, అన్న కొడుకు ఎర్రగుంట రాఘవరెడ్డి కేకలు వేసుకుంటూ అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆరుగురు బైక్‌లలో పారిపోయారు. ఈ ఘటనపై చెన్నారెడ్డి భార్య భాగ్యలక్ష్మి ధర్మవరం రూరల్‌ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఆరుగురు ముద్దాయిలపైన, వారికి ఆశ్రయం ఇచ్చినందుకు మిడతల రామాంజినేయులు, బాలగొండ చంద్రశేఖర్‌పైన చార్జిషీటు దాఖలు చేశారు. జిల్లా సెషన్స కోర్టులో ఈ కేసును విచారించారు. ప్రాసిక్యూషన తరపున ఏడుగురు సాక్షులను, ముద్దాయిల తరఫున ఒకరిని విచారించారు. నేరం రుజువు కావడంతో మొదటి ఆరుగురు ముద్దాయిలకు కోర్టు శిక్ష విధించింది. 7, 8వ ముద్దాయిలపై నేరం రుజువు కానందున కేసును కొట్టివేశారు. ప్రాసిక్యూషన తరఫున రాచమల్లు హరినాథరెడ్డి కేసును వాదించారు. ఈ కేసును సీఐ జి.శివరాముడు దర్యాప్తు చేసి, చార్జిషీటు వేశారు. కోర్టు శిక్ష విధించగానే ముద్దాయిలను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Updated Date - 2023-01-24T23:58:43+05:30 IST