కేవైసీ కష్టాలు..!
ABN , First Publish Date - 2023-11-22T00:00:56+05:30 IST
గ్యాసు వినియోగదారులకు కేవైసీ కష్టాలు అన్ని ఇన్ని కావు. కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

గార్లదిన్నె, నవంబరు 21: గ్యాసు వినియోగదారులకు కేవైసీ కష్టాలు అన్ని ఇన్ని కావు. కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో భారతగ్యాస్‌కు సంబంధించి రెగ్యులర్ కనెక్షన్లు దాదాపు 12 వేలు, ప్రధానమంత్రి యోజన ఉజ్వల భవిష్యత్తు పథకం ద్వారా రేషనకార్డు లబ్ధిదారులకు ఇచ్చిన కనెక్షన్లు సుమారు 1360కి పైగానే ఉన్నాయి. అయితే మండలంలో గ్యాస్ వినియోగదారులు వెంటనే కేవైసీ చేయించుకోవాలని దండోరా వేశారు. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా మంగళవారం భారత గ్యాస్ కార్యాలయం చేరుకున్నారు. వినియోదారుల క్యూలైన సుమారు అర కిలోమీటర్ దాటింది. కేవైసీకి వచ్చిన వినియోగదారులకు భారతగ్యాస్ ఏజెన్సీ ఏమాత్రం సౌకర్యాలు కల్పించలేదు. దీంతో ఎండలోనే వినియోగదారులు గంటల తరబడి నిలబడ్డారు. కనీసం తాగేందుకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. కాగా, ఉజ్వల భవిష్యత్తు వినియోగదారులకు డిసెంబరు చివరి వరకు, రెగ్యులర్ వినియోగదారులకు 2024 ఫిబ్రవరిలోపు కేవైసీ చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.