కసాపురం హుండీ దోపిడీ

ABN , First Publish Date - 2023-09-19T23:59:25+05:30 IST

కసాపురం ఆలయ హుండీ ఇంటిదొంగలపాలవుతోంది. హుండీని రక్షించాల్సిన సెక్యూరిటీ గార్డు క్రిష్ణారెడ్డి హుండీల్లోకి చేయి పెట్టి డబ్బును లాఘవంగా దొంగిలించాడు.

కసాపురం హుండీ దోపిడీ
హుండీ నుంచి సొమ్మును తస్కరిస్తున్న సెక్యూరిటీ గార్డు క్రిష్ణారెడ్డి

సీసీ కెమెరా రికార్డులను పరిశీలిస్తున్న

ఈఓ, ఇతర అధికారులు

హుండీ నుంచి

సొమ్మును తస్కరిస్తున్న

సెక్యూరిటీ గార్డు

క్రిష్ణారెడ్డి

గుంతకల్లు, సెప్టెంబరు 19: కసాపురం ఆలయ హుండీ ఇంటిదొంగలపాలవుతోంది. హుండీని రక్షించాల్సిన సెక్యూరిటీ గార్డు క్రిష్ణారెడ్డి హుండీల్లోకి చేయి పెట్టి డబ్బును లాఘవంగా దొంగిలించాడు. ఎనిమిదిసార్లు డబ్బును హుండీలోంచి తీసి జేబులో కుక్కుకుంటున్న దృశ్యం సీసీ కెమెరాల్లో బయటపడింది. దొంగతనాన్ని రూఢీగా తెలుసుకున్న ఆలయ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు.

నిండు హుండీయే టార్గెట్‌

సెక్యూరిటీగార్డు క్రిష్ణారెడ్డి ఆలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రధాన హుండీ నిండి డబ్బు చేతికందేలా ఉన్న సమయాల్లో డబ్బును తస్కరించడం పనిగాపెట్టుకున్నాడు. అర్చకులు గర్భగుడిలో వారి పనిలో బిజీగా ఉన్న సమయాల్లో ఇతడు తన చేతివాటాన్ని చూపుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆలయ ఉద్యోగులు రహస్యంగా కసాపురం దేవస్థానం వద్ద విధులను నిర్వహించే కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లుకు ఉప్పందించారు. దీంతో అతడు విషయాన్ని కసాపురం సీఐ, ఎస్‌ఐకు చేరవేశాడు. తర్వాత దొంగతనం జరుగుతున్న విషయాన్ని ఆలయ ఈఓకు పోలీసులు తెలియజేసి, తమకు సమాచారం అందినమేరకు ఉదయం సమయాలలో సీసీ ఫుటేజిలను భద్రపరచాలని ఆదేశించారు. పోలీసులకు తన దొంగతనం విషయం తెలిసిపోయిందన్న సమాచారం గ్రహించిన క్రిష్ణారెడ్డి బైటపడటానికి అధికార పార్టీ నాయకులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ మేరకు వినాయక చవితి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆలయ అధికారులు సీసీ ఫుటేజిని పరిశీలించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు 17వ తేదీ ఉదయం 4 గంటల సయమంలో ఆలయంలోకి ప్రవేశించిన క్రిష్ణారెడ్డి ఎనిమిదిసార్లు ప్రధాన హుండీలోకి చెయ్యిపెట్టి నోట్లను లాగి జేబులో కుక్కుకున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఫుటేజీని పరిశీలిస్తున్న సమయంలో కసాపురం వైసీపీ నాయకులు ఈఓ చాంబరులో ఉండటంతో క్రిష్ణారెడ్డిని తప్పించడానికి యత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

క్రిష్ణారెడ్డిపై ఫిర్యాదు

ఈఓ చాంబరులో జరుగుతున్న విచారణను తెలుసుకోవడానికి నిందితుడు క్రిష్ణారెడ్డి చాంబరు బైట వాకిట నిలబడి లోనికి తొంగిచూస్తూ అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలైనా ఆలయ ఈఓ అధికారికంగా వివరాలు తెలపకపోవడంతో విలేఖరులు అసహనాన్ని వ్యక్తంచేశారు. అనంతరం వారిని లోనికి పిలిచిన ఈఓ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ దొంగతనం వివరాలను వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు పరిశీలించగా దొంగతనం జరిగిన సంగతి వాస్తవమని వెల్లడైందన్నారు. ఈ విషయంగా పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేస్తామని, వెంటనే క్రిష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించినట్లు తెలియజేశారు. అనంతరం వెనుకటి రోజుల సీసీ ఫుటేజిలను పరిశీలించగా 9, 12 తేదీల్లో సైతం ఇతడు హుండీ డబ్బును తస్కరించినట్లు తెలుసుకున్నారు. ఆలయంలో దొంగతనాలు జరక్కుండా పరిరక్షించాల్సిన సెక్యూరిటీ గార్డే ఇలా దొంగతనానికి పాల్పడ్డంపై భక్తులు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇతడు ఎన్నో రోజులుగా ఈ పనిచేస్తున్నా, సీసీ కెమెరాలున్నా ఎలా కనుగొనలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఎవరో పోలీసులకు ఉప్పందించడంతో భాగోతం బైటపడిందని, లేదంటే ఇలాగే అవిచ్ఛిన్నంగా కొనసాగి ఉండేదని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2023-09-19T23:59:25+05:30 IST