Share News

ఆయ‘కట్‌’పై కాలవ ఆగ్రహం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:33 AM

బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఆయ‘కట్‌’పై కాలవ ఆగ్రహం
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న మాజీ మంత్రి

బొమ్మనహాళ్‌, డిసెంబరు 17: బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయం నుండి ప్రత్యామ్నాయ నీటిని తీసుకోవడంలో జిల్లా ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. కర్ణాటకలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు బళ్లారి వరకు ప్రత్యామ్నాయ నీటిని తీసుకుని రైతులకు అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు రైతులపై శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. హంద్రీనీటిని కూడా తీసుకురాలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్‌ మండలంలోని దర్గాహోన్నూరు. గోవిందవాడ, బొల్లనగుడ్డం, కళ్లుహోళ తదితర గ్రామాలలో ఉన్న ఆయకట్టులో సాగైన మిరపపంట ఎండిపోతోందని, ఈ నెలాఖరి వరకు ప్రత్యామ్నాయ నీటిని తెచ్చి ఉంటే రైతులు పంట దిగుబడి బాగా తీసుకునేవారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సాధికారిక రాష్ట్ర కార్యదర్శి సుదర్శన, బీసీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప, మైనార్టీ నాయకుడు రఫీ, మాజీ కో ఆప్షన మెంబర్‌ శర్మా్‌సవలి, మాజీ ఎంపీటీసీ ఆనంద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాగరాజు, నాయకులు వీఎల్‌ రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:33 AM