జేవీకే కిట్లు అరకొరే..!

ABN , First Publish Date - 2023-05-25T23:57:56+05:30 IST

జగనన్న విద్యాకానుక కిట్లు జిల్లాకు ఇంకా పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. నోట్‌ పుస్తకాలు ఒక్కటీ కూడా రాలేదు.

  జేవీకే కిట్లు అరకొరే..!

నోటు పుస్తకం ఒక్కటీ రాలేదు

చాలా మండలాలకు అందని యూనిఫామ్స్‌

బూట్లు 30.20 శాతమే సరఫరా

మరో రెండు వారాలే గడువు

అనంతపురం విద్య, మే 25: జగనన్న విద్యాకానుక కిట్లు జిల్లాకు ఇంకా పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. నోట్‌ పుస్తకాలు ఒక్కటీ కూడా రాలేదు. జగనన్న విద్యాకానుక కిట్లు-4వ విడత జిల్లాకు అరకొరగానే చేరా యి. బ్యాగులు, బెల్టులు, బూట్లు, యూనిఫామ్‌, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ ఇలా మండల కేంద్రాలకు చేరుస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో చేరలేదు. పాఠశాలల పునఃప్రారంభం సమయానికైనా పూర్తి స్థాయిలో అందిస్తారో లేదోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నోట్‌ బుక్స్‌ ఎక్కడ?

జిల్లా వ్యాప్తంగా 31 మండలాలకు ఇండెంట్‌ మేరకు 11,99,138 నోట్‌ పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరలేదు. జిల్లా కేంద్రమైన అనంతపురానికే ఇంకా చేరలేదు. ఇక జిల్లా సరిహద్దు మండలాలకు చేరడానికి మరింత సమయం పట్టే అవ కాశం ఉంది. 31 మండలాల పరిధిలోని విద్యార్థులకు 68.93 శాతం మాత్ర మే యూనిఫామ్స్‌ డెలివరీ చేశారు. ఇంకా అనంతపురం, ఆత్మకూరు, బ్రహ్మసముద్రం, గార్లదిన్నె, కూడేరు, నార్పల, పామిడి పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, రాప్తాడు శింగనమల, తాడిపత్రి, యాడికి, యల్లనూరు మండలాలకు ఇప్పటి వరకూ ఒక్క పీస్‌ కూడా చేరలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

సీఆర్పీలతో వెట్టి చాకిరీ..

జిల్లాలో ప్రతి ఏటా సీఆర్సీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. జగనన్న విద్యాకానుక కిట్లు రాగానే వారితో పెద్ద ఎత్తున పనులు చేయిస్తున్నారు. వారిలో చాలా మంది డిగ్రీలు, పీజీలు చేసినవారు ఉన్నారు. అయితే జేవీకే కిట్లు వచ్చి ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో సైతం పనులు చేయిస్తున్నారు. జిల్లాకు వచ్చిన పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్టులు వంటి 9 రకాలు వస్తువులకు జేవీకే కిట్లుగా ప్యాక్‌ చేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి వారితో పనులు చేయిస్తున్నారు. పనులైతే అదనంగా చేయించుకుంటున్నారు కానీ వారికి అదనంగా ఎలాంటి అలవెన్సులు ఇవ్వడంలేదు. రోజుకు రూ. 100 చొప్పున ఇస్తామని చెప్పినా...ఇప్పటి వరకూ ఇవ్వలేదు. గత నాలుగేళ్లుగా పనులు తప్ప పైసలు ఇవ్వడం లేదని సీఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండెట్‌ అలా.. సరఫరా ఇలా

జిల్లా వ్యాప్తంగా 31 మండలాలు ఉంటే... బ్యాగులు 2,18,983, బెల్టులు 1,60,350, డిక్షనరీలు 43,524, నోట్‌ పుస్తకాలు 11,99,138, బూట్లు 2,18,983, యూనిఫామ్స్‌ 2,18,983, పాఠ్యపుస్తకాలు 15,62,777, వర్క్‌బుక్స్‌ 3,97,275 జిల్లాకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ బ్యాగులు, బెల్టులు పూర్తిస్థాయిలో రాగా, డిక్షనరీలు 24,550, బూట్లు65,980, యూనిఫామ్‌ 1,50,955, పాఠ్య పుస్తకాలు 6,05,822, వర్క్‌బుక్స్‌ 2,45,256 మాత్రమే జిల్లాలోని పలు మండలాలకు చేరినట్లు అధికారులు చెబుతు న్నారు. జిల్లాకు సరఫరా చేసిన వస్తువుల్లో ఒక్క బ్యాగులు, బెల్టులు వందశాతం మినహా డిక్షనరీలు 56.41 శాతం, బూట్లు 30.20శాతం, యూనిఫామ్స్‌ 68.93 శాతం, పాఠ్యపుస్తకాలు 38.77 శాతం, వర్క్‌బుక్స్‌ 64.00 శాతం చేరాయి.

Updated Date - 2023-05-25T23:57:56+05:30 IST