Share News

కంపచెట్లతో నిండిన జగనన్న లేఔట్లు

ABN , First Publish Date - 2023-12-10T23:39:01+05:30 IST

ఇళ్లులేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంలో 17 జగనన్న లేఔట్లు ఏర్పాటు చేశారు. వీటిని అనువుగాని చోట వేయడంతో సమస్య ఏర్పడింది. ఇటువంటిచోట్ల చాలామంది ఇళ్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపడంలేదు.

కంపచెట్లతో నిండిన జగనన్న లేఔట్లు

అద్దెలు కట్టలేక లబ్ధిదారుల అగచాట్లు

నంబులపూలకుంట, డిసెంబరు 10: ఇల్లు కట్టుకోవాలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. కనీసం ప్రభుత్వ హామీతో అయినా ఆ ఆశ నెరవేరుతుందనుకుంటే అది కలగానే మిగిలిపోతోంది. మండలవ్యాప్తంగా 14 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 411 మంది ఇళ్లులేని లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. 128 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంలో 17 జగనన్న లేఔట్లు ఏర్పాటు చేశారు. వీటిని అనువుగాని చోట వేయడంతో సమస్య ఏర్పడింది. ఇటువంటిచోట్ల చాలామంది ఇళ్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపడంలేదు.

కొన్ని లేఔట్లను నీరు నిల్వ ఉంటే చెరువు దగ్గరగా ఏర్పాటుచేశారు. ఇక్కడ ఎప్పుడు వర్షం పడినా ఆ ప్రదేశం అంతా నీటి ఊటలతో నిండిపోతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలనీ, ఎలా జీవనం చేయాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ లేఔట్లను ఎన్పీకుంటలో రెండు, గౌకనపల్లిలో మూడు, మరికొమ్మెదిన్నెలో ఒకటి, పి.కొత్తపల్లి, పాపాన్నగారిపల్లి, పెడబల్లి, బలిజపల్లి, మేకలచెరువు, ఎదురుదొన్న, ధనియానచెరువు, ముండ్లవారిపల్లి, పోతురెడ్డి, వంకమద్ది, పెద్దరాంపల్లి గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెడబల్లి, గౌకనపల్లి, ధనియానచెరువు, ముండువారిపల్లి లేఔట్లలో మాత్రమే ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. మిగిలినచోట్ల అసలు పనులే ప్రారంభంకాలేదు.

మండల కేంద్రంలో నాలుగు ఎకరాల్లో 225 మందికి పట్టాలు మంజూరు చేశారు. ఈప్రాంతంలో ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకపోవడంతో కంపచెట్లతో నిండిపోయింది. బలిజపల్లి పంచాయతీ పరిధిలోని ఒట్టిమిద్ది సమీపంలో చెరువు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జగనన్న లేఔట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ శీలంవారిపల్లి, ఒట్టిమిద్ది, గోవిందువారిపల్లి గ్రామాలకు చెందిన 40 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలిచ్చారు. ఈ లేఔట్‌ నివాస యోగ్యం కాదని ఇంటినిర్మాణాలకు ఎవరూ ముందుకురాలేదు. మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి స్థిరపడి, కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలు అనేకమున్నాయి. మరికొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాల నుంచి అద్దె ఇళ్లలో ఉంటూ కూలి పనులు చేసుకుని, పొట్ట నింపుకుంటున్నాయి. ఇంటి పట్టాలు ఇవ్వడంతోపాటు నిర్మాణాలు తామే చేపట్టి, తాళాలు చేతికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వ హామీ ఏమైనట్లు అని వారందరూ ప్రశ్నిస్తున్నారు.

అద్దె ఇళ్లలోనే జీవనం

మండలకేంద్రంలోని జగనన్న లేఔట్‌లో నాకు పట్టా ఇచ్చారు. నా ప్లాటు నెంబరు 83. కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు. టైలర్‌ పనిచేసుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నా. ప్రభుత్వ పట్టా ఇచ్చి రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఇల్లు మంజూరైందేకానీ, ఇంటి నిర్మాణం చేపట్టడానికి నన్ను సంప్రదించలేదు. అద్దెలు చెల్లించాలంటే కష్టంగా ఉంది.

- చిన్నఖాసీంఖాన, నంబులపూలకుంట

భర్త పింఛనతోనే కుటుంబ జీవనం

నా భర ్తకు గుండె ఆపరేషన జరిగింది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన మంజూరు చేసింది. నాకు ఇద్దరు కు మారులుండేవారు. వారు చనిపోయారు. ఉండడానికి గూడుకూడాలేదు. నా భర్తకు రూ.2,700 ఫింఛన వస్తే ఇందులో రూ.2,500 ఇంటి అద్దెకే సరిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యంతోనే జీవనం సాగస్తున్నాం. మా ప్రాణాలు పోతే అద్దె ఇంటివారు శవాన్ని కూడా ఇంటిలో ఉంచుకోనీరు. అందుకోసమైనా మాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నా.

- రహమతబీ, నంబులపూలకుంట

Updated Date - 2023-12-10T23:39:04+05:30 IST