లోకాన్ని రక్షిస్తున్న జగన్మాత
ABN , First Publish Date - 2023-11-06T00:01:17+05:30 IST
రాశీభూతమైన కారుణ్యంతో సృష్టి, స్థితి, లయచేస్తూ జగన్మాత లోకాన్ని రక్షిస్తోందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు
కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
అనంతపురం సెంట్రల్, నవంబరు 5: రాశీభూతమైన కారుణ్యంతో సృష్టి, స్థితి, లయచేస్తూ జగన్మాత లోకాన్ని రక్షిస్తోందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ’మాతృ చతుష్టయం’పై ప్రవచన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ కన్నతల్లిప్రేమ దైవంతో సమానమని, ఆమె రుణం తీర్చుకోలేనిదన్నారు. శ్రీరామచంద్ర మూర్తి నుంచి వివేకానందస్వామి, అబ్దుల్ కలాం వరకు ఎందరో మహానుభావుల జీవితాలను తీర్చిదిద్దింది వారి మాతృమూర్తులేనన్నారు. శంకరభగవత్పాదులు, రమణ మహర్షి వంటి గొప్పగురువులు సన్యాసాశ్రమం స్వీకరించినా చివరివరకూ వారి తల్లులను గౌరవంతో సమాదరించారన్నారు. సంస్కృతి పరిరక్షణ ద్వారా ఆధ్యాత్మికత, మానవీయ సంబంధాలు, శాంతి సామరస్యాలు బలపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలచేత వారి తల్లులకు పాదపూజ చేయించిన చాగంటి, అనంతరం తల్లిప్రేమ గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.