జగన్‌ది మోసం..
ABN , First Publish Date - 2023-03-19T02:49:21+05:30 IST
వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో రైతాంతం వెన్ను విరిచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.

అధికారంలోకొచ్చాక రైతుల వెన్ను విరిచారు
కాపులు, బలిజలను అణచివేస్తున్నారు
గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు
2025లో మా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ఇస్తాం
46వ రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
పుట్టపర్తి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో రైతాంతం వెన్ను విరిచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా 46వ రోజైన శనివారం ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో నడక సాగించారు. తనకల్లు మండలం చీకటిమానుపల్లి విడిది నుంచి గంగసానిపల్లి, బిసనివారిపల్లి, కొక్కంటిక్రాస్, మండ్లిపల్లి, తనకల్లు, పరాకువాండ్లపల్లి, ఎర్రగుంటపల్లి, నల్లచెరువు మండలంలోని చిన్నపల్లోల్లవారిపల్లి రాత్రి విడిడి కేంద్రం వరకు 14.1 కిలోమీటర్లు నడిచారు. లోకేశ్ వెంట మహిళలు, టీడీపీ శ్రేణులు, యువకులు యాత్రలో పాల్గొన్నారు. గంగసానిపల్లి, కొక్కింటి క్రాస్ వద్ద టమోటా రైతులు, బలిజలు, గిరిజనులతో లోకేశ్ మాట్లాడారు. జగన్ అధికారంలోకొచ్చాక రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి మోసగించారన్నారు. ీ టీడీపీ అధికారంలోకి వచ్చాక టమోటా రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీఇచ్చారు. జగన్ కాపులను, బలిజలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. ఆలు కట్టించి, అర్చకులకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. బొమ్మలకుంట గ్రామం వద్ద గిరిజనులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు. అనేక గిరిజన సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అధికారంలోకొస్తే జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతారా అని కొందరు యువకులు అడుగుతున్నారని.. తమది కక్ష సాధించే ఎజెండా కాదని.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, అదే జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. ఖనిజ సంపందపై జగన్ అండ్ కో కన్ను పడిందని, అందుకే గిరిజనుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. 2025లో జాబ్‌క్యాలెండర్ విడుదల చేస్తామని, రాబోయే ప్రభుత్వం టీడీపీదేనని అన్నారు.
లోకేశ్ కుడి భుజానికి గాయం
శుక్రవారం సాయంత్రం పాదయాత్ర అన్నమయ్య జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించే సమయంలో పోలీసులు భద్రతను గాలికొదిలేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. లోకేశ్ కుడి భుజానికి స్వల్పంగా గాయాలయ్యాయి. భుజం నొప్పి ఉున్నా.. శనివారం లోకేశ్ పాదయాత్రలో ఉత్సాహంగా ముందుకు సాగారు. పాదయాత్ర ఆదివారానికి 600 కి.మీ. మైలురాయి చేరనుంది.
బాబు ప్రాణం పోస్తే.. జగన్ ఆధారం తీశాడు
కదిరి/అమడగూరు, మార్చి 18: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాపకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.40లక్షలు వెచ్చించి, వైద్యం చేయించారు. ఆ కుటుంబానికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించారు. జగన్ అధికారం చేపట్టాక కాంట్రాక్టు ఉద్యోగం ఉందని ఆ ఇంట్లో వారి పింఛన్లు తొలగించారు. ఆ బాధితులు శనివారం లోకేశ్‌ను కలిసి గోడు వినిపించారు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం ఆర్‌ఎస్ కొత్తపల్లికి చెందిన రమణప్ప కుమార్తె జ్ఞానసాయి 9 నెలల వయసులో (2016లో) కాలేయ సమస్యతో బాధపడేది. నాడు చంద్రబాబు సాయంతోనే పాప ప్రాణాలు దక్కాయంటూ ఆ కుటుంబం లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. పార్టీ తరపున సాయం చేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.