ఆర్టీసీ గుత్తి డిపోను తరలిస్తే ఉద్యమిస్తాం
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:02 AM
పట్టణంలోని ఆర్టీసీ డిపోను గుంతకల్లుకు తరలించాలన్న యోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.
గుత్తి, డిసెంబరు 28: పట్టణంలోని ఆర్టీసీ డిపోను గుంతకల్లుకు తరలించాలన్న యోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. గురువారం డిపో తరలింపుపై స్ధానిక డిపోలో అధికారులను టీడీపీ నాయకులు కలిశారు. డిపో మేనేజరు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. పట్టణంలో ఎన్నోఏళ్లుగా డిపో నడుస్తోందన్నారు. డిపో మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. జాతీయ రహదారులు, రైల్వే జంక్షన ఉందన్నారు. ఆర్టీసీ డిపో ఉండడంతో దూరప్రాంతాలకు ఇక్కడ నుంచి అనేక మంది రాకపోకలను సాగిస్తున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న డిపోను ఉన్నఫలంగా గుంతకల్లుకు తరలిస్తున్నారన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి దిల్కాశీనా, పట్టణ కన్వీనర్ రవిశంకర్‌గౌడ్, మైనార్టీ ప్రతినిధి, టౌనబ్యాంక్ అధ్యక్షుడు అబ్దుల్‌జిలాన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన శ్రీనివాసయాదవ్, టౌనబ్యాంక్ డైరెక్టర్లు కృష్ణ, వీరన్న, నాయకులు గోవర్ధనగౌడ్, సూరి, సాంబశివయాదవ్, నారాయణస్వామి పాల్గొన్నారు.