హమ్మయ్యా..!

ABN , First Publish Date - 2023-06-01T00:32:22+05:30 IST

సర్వజన వైద్యశాల ప్రసూతి వార్డులో ప్రక్షాళన మొదలైంది. ఆంధ్రజ్యోతి కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. గర్భిణులు, బాలింతల కోసం ఐడీ వార్డులో 40 పడకలను సిద్ధం చేశారు. మరో 20 పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

హమ్మయ్యా..!
బెడ్‌పై గుత్తికి చెందిన బాలింత షబానా, కింద కుటుంబ సభ్యులు

గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పడకలు

ఐడీ వార్డులో ఏర్పాట్లు.. అమ్మచెంతనే బిడ్డ

అంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు

అనంతపురం టౌన

సర్వజన వైద్యశాల ప్రసూతి వార్డులో ప్రక్షాళన మొదలైంది. ఆంధ్రజ్యోతి కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. గర్భిణులు, బాలింతల కోసం ఐడీ వార్డులో 40 పడకలను సిద్ధం చేశారు. మరో 20 పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రసవం కోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి వచ్చినవారి కష్టాల గురించి ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురిస్తోంది. పడకల కొరత కారణంగా గర్భిణులు, బాలింతలు, శిశువులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టింది. దీంతో కలెక్టర్‌ గౌతమి సీరియస్‌గా తీసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా కొత్త ఐడీ వార్డులో పడకలు సిద్ధం చేస్తున్నారు. పలువురు బాలింతలను బుధవారం కొత్త వార్డుకు తరలించారు. అక్కడ వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. డీఎంహెచఓ డాక్టర్‌ వీరబ్బాయి, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌ కొత్త వార్డును పరిశీలించారు. బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ వైవీ రావు, డాక్టర్‌ పద్మజ కొత్త వార్డులో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వసతి బాగుంది..

అక్కడ మంచాలు లేక ఇబ్బంది పడ్డాం. రెండు మంచాల్లో నలుగురు ఉండే వాళ్లం. పిల్లలను దగ్గర ఉంచుకునే అవకాశం ఉండేది కాదు. పాలిచ్చేందుకు, పడుకునేందుకు అవస్థలు పడ్డాం. కొత్త వార్డులో ప్రత్యేక మంచం ఇచ్చారు. ఇక్కడ గాలి, వెలుతురు బాగా ఉంది. ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు.

- షబానా, బాలింత, గుత్తి

సంతోషంగా ఉంది...

ఆ గదులలో ఎలా ఉన్నామో మాకే తెలియదు. బిడ్డ కోసం కష్టాలు భరించాం. పడకలు సరిపడక నన్ను రెండు గదులకు మార్చారు. గర్భిణులు, బాలింతల అవస్థల గురించి ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో మా కష్టాలు తీరాయి. ఈ రోజు కొత్త వార్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగుంది. సంతోషంగా ఉంది.

- పద్మ, బాలింత, పాతూరు, అనంతపురం

సమస్య రాకుండా చూస్తాం..

ప్రసవాల సంఖ్య పెరగడంతో బాలింతలు, గర్భిణులకు పడకల కొరత ఏర్పడిన విషయం వాస్తవమే. వచ్చిన వారిని వెనక్కు పంపకుండా అడ్మిషన చేసుకోవడం వల్ల ఒక్కో మంచంలో ఇద్దరిని, రెండు మంచాల్లో నలుగురిని ఉంచాల్సి వచ్చింది. దీంతో బాలింతలు కష్టాలు పడ్డారు. ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో కలెక్టర్‌ మేడం స్పందించి, తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొత్త వార్డుల్లో 40 మంచాలు ఏర్పాటు చేశాం. మరో 20 మంచాలను సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో బాలింతలకు ఇలాంటి సమస్యలు లేకుండా చూస్తాం.

- డాక్టర్‌ రఘునందన, సూపరింటెండెంట్‌, జిల్లా సర్వజన వైద్యశాల

Updated Date - 2023-06-01T00:32:22+05:30 IST