ఇంకెన్నాళ్లకు..?
ABN , First Publish Date - 2023-06-11T00:44:14+05:30 IST
జిల్లా కేంద్రమైన అనంతపురం విస్తృతి పెరిగిపోవడంతో ఎట్టకేలకు అర్బన, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. కేబినెట్ ఆమోదం తర్వాత గెజిట్ వెలువడి నెలలు దాటుతున్నా అందుకు తగిన విధంగా అడుగులు ముందుకు పడలేదు. ఈ క్రమంలోనే అభ్యంతరాల కోసం నెలరోజుల గడువు ఇచ్చారు. అది పూర్తయి నెల
వేర్వేరు తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం
గెజిట్ వెలువడి నెల రోజులైనా కనిపించని ముందడుగు
పూర్తి కాని సిబ్బందికేటాయింపు
అనంతపురం రూరల్:
జిల్లా కేంద్రమైన అనంతపురం విస్తృతి పెరిగిపోవడంతో ఎట్టకేలకు అర్బన, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. కేబినెట్ ఆమోదం తర్వాత గెజిట్ వెలువడి నెలలు దాటుతున్నా అందుకు తగిన విధంగా అడుగులు ముందుకు పడలేదు. ఈ క్రమంలోనే అభ్యంతరాల కోసం నెలరోజుల గడువు ఇచ్చారు. అది పూర్తయి నెల రోజుల కిందట తుది గెజిట్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లో వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటవుతాయని అందరూ భావించారు. అదిగో..ఇదిగో అనడమే తప్ప కార్యాలయం ఏర్పాటుకు కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తహసీల్దార్ కార్యాలయాలు వేర్వేరుగా ఏర్పాటు కావడం వల్ల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అర్బన, రూరల్ పరిధిలో మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రూరల్ ప్రాంతంలో 21 పంచాయతీలు ఉన్నాయి. ఇవి ప్రస్తుత కార్యాలయానికి అటు..ఇటుగా 10 నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు, రైతులు కార్యాలయానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవస్థలు పడి కార్యాలయానికి వస్తే అధికారులు ఉంటారన్న నమ్మకం లేదు. ప్రజలు, రైతులే కాదు కార్యాలయ అధికారులు, సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కరే తహసీల్దార్ ఉండడం సిబ్బంది కూడా తక్కువగా ఉండడంతో ప్రొటోకాల్, విచారణలు, కోర్టు కేసులు తదితర పనులన్నీ ఒకరిపైనే పడుతున్నాయి. రెండు కార్యాలయాలు ఏర్పాటయితే అధికారులకు, ప్రజలకు, రైతులకు ఊరటగా ఉంటుంది.
నేటికీ పూర్తి కాని సిబ్బంది కేటాయింపు
నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలంటే అధికారులతోపాటు సిబ్బంది కేటాయింపు తప్పని సరి. అర్బన, రూరల్ మండలాలకు సిబ్బంది కేటాయింపులో జాప్యం జరుగుతోంది. కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటి తహసీల్దార్, ఆర్‌ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు అటెండర్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన బదిలీల్లో కూడా అధికారులు, సిబ్బంది కేటాయింపు జరగలేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలోనని ప్రజలు విమర్శిస్తున్నారు.
పనులన్నీ విడిచిపెట్టి రావాలి
మాది మన్నీలా గ్రామం. ఊరు నుంచి ప్రస్తుతం ఉన్న కార్యాలయానికి 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. కార్యాలయానికి రావాలంటే మూడు ఆటోలు మారాలి. ఊరి నుంచి సంగమేష్ సర్కిల్‌కు, అక్కడి నుంచి టవర్‌క్లాక్‌కు, అక్కడి నుంచి హెచఎల్‌సీ కెనాల్ వద్ద ఉన్న కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అన్ని అవస్థలు పడి వస్తే పని జరుగుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. సకాలంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుంది.
- లక్కప్ప, రైతు
త్వరలోనే కార్యాలయం ఏర్పాటు
తహసీల్దార్ నూ తన కార్యాలయం ఏర్పాటుకు ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపు జరగాల్సి ఉంది. సిబ్బంది కేటాయింపు జరగగానే రూరల్ ప్రాంతానికి కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా కార్యాలయ ఏర్పాటుకు భవనాలు వెతుకుతున్నాం. అన్ని విధాల అనువుగా ఉండే ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తాం.
- శ్రీధర్ మూర్తి, తహసీల్దార్
త్వరితగతిన ఏర్పాటు చేయాలి
అర్బన, రూరల్ మండలాలకు వేర్వేరు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని కొన్నేళ్లుగా వింటున్నాం. అంతా అయిపోయింది అన్నారు. అయినా ఇంత వరకు కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఏదైనా పనిమీద వెళితే..అధికారులను కలిసే పరిస్థితి ఉండదు. ఒక్కరే తహసీల్దార్ ఉండటం వల్ల నిత్యం ప్రజలతో రద్దీ ఉంటుంది. మా సమస్యను చెప్పుకునేందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. రూరల్ ప్రాంతానికి కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులను, సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది.
- వెంకటనారాయణ, అక్కంపల్లి